– జాతకం చెబుతానంటూ ఇంట్లోకొచ్చి బంగారు ఆభరణాల అపహరణ
బత్తలపల్లి : జాతకం చెబుతానంటూ ఓ మాయలేడి అమాయకురాలిని బురిడీ కొట్టించింది. ఐదు తులాల బంగారు, ఐదు తులాల వెండి ఆభరణాలను అపహరించి ఉడాయించింది. బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకెళితే.. బత్తలపల్లికి చెందిన గౌసియా మంగళవారం మధ్యాహ్నం ఇంటి ముందు దుస్తులు ఉతుకుతోంది. ఇదే సమయంలో ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి ‘మీ ఇంటి వాస్తు బాగలేదు. మీకు ఏదీ కలిసి రావడం లేదం’టూ మాటలు కలిపింది. దీంతో గౌసియా తన సమస్యలు ఏకరువుపెట్టింది. బయటెందుకు ఇంటిలోకి వెళ్దామంటూ గుర్తు తెలియని మహిళ అనడంతో సరేనని లోనికి తీసుకెళ్లింది. బియ్యం పోసి.. పూజలు చేయాలంటూ సెలవిచ్చింది.
దీంతో బియ్యం పోయడానికి చిన్న పాత్రలు లేవనడంతో తనవద్దనున్న పాత్రలను ఇచ్చింది. అందులో బియ్యం పోయగా బంగారు, వెండి నగలుంటే ఇవ్వండి వాటికి కూడా పూజలు చేస్తానని నమ్మబలికింది. దీంతో గౌసియా బీరువాలోనుంచి ఐదు తులాలు (నెక్లెస్, మాటీలు, జుంకీలు, కమ్మలు), ఐదు తులాల వెండి ఆభరణాలు ఇచ్చింది. అనంతరం దక్షణగా రూ.2,100 పెట్టమంది. అన్నిటినీ సమకూర్చిన అనంతరం గౌసియాపై బియ్యం చల్లి.. తాను వెళ్లిన అనంతరం వాటిని సర్దుకోవాలని సూచించింది. తనను కొంత దూరం సాగనంపాలనడంతో ఆమెతో కలిసి గౌసియా కూడా కొంత దూరం వరకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చింది. ఇంట్లో బంగారు, వెండి వస్తువులు కనిపించకపోయేసరికి స్థానికులకు తెలిపింది. వారు వచ్చి చూడగా అప్పటికే గుర్తు తెలియని మహిళ ఎక్కడా కనిపంచలేదు. వెంటనే బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఆమెను గుర్తు పట్టారు. అయితే ఆమె ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు అన్న వివరాలను ఆరా తీస్తున్నారు.
విద్యార్థి మెడలో బంగారు గొలుసు చోరీ
మండల కేంద్రం బత్తలపల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి దామోదర్ బ్యాంకులో తాకట్టు పెట్టిన ఒకటిన్నర తులం బంగారు చైనును విడిపించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ కూడలికి చేరుకున్నాడు. పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు రాగానే బస్సు ఎక్కాడు. ఇంతలో మెడలో చైను కనిపించలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. రెండు కేసులూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మాయలేడి
Published Tue, Jul 18 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM
Advertisement
Advertisement