ఏటీఎం ఏమార్చి.. రూ.30వేలు కాజేసి..!
బత్తలపల్లి : ఓ అమాయకుడిని ఏమార్చి అతడి ఏటీఎంను అపహరించి, ఆ తర్వాత దానితో రూ.30వేలు డ్రా చేసుకున్న ఘనుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల ఎనిమిదో తేదీన నార్పల మండలం గుంజేపల్లికి చెందిన శివారెడ్డి తనకు డబ్బులు అవసరముండి బత్తలపల్లిలోని కార్పొరేషన్ బ్యాంకు వద్దనున్న ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అయితే డబ్బు డ్రా చేయడం తెలీక ఇబ్బంది పడుతుండటంతో ఓ అపరిచిత వ్యక్తి అక్కడకు వచ్చాడు. అతడిని శివారెడ్డి సాయం చేయాలని కోరాడు. తొలుత రూ.10 వేలు తీసుకున్నాడు. అనంతరం మరో రూ.5వేలు కావాలని అడగగా డబ్బులు తీసిన తర్వాత ఏటీఎంను మార్చి ఇచ్చాడు. అనంతరం ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.
కొద్దిసేపటి తర్వాత అపరిచిత వ్యక్తి కదిరి రోడ్డులోని పెట్రోలు బంకులో సిబ్బందితో కుమ్మక్కై స్వైప్ మిషన్ ద్వారా వారి ఖాతాలోకి నగదు ట్రాన్స్‌ఫర్ చేసి రూ.25వేలు, మరో చోట రూ.5వేలు డ్రా చేసుకున్నాడు. ఈ సమాచారం శివారెడ్డి సెల్‌కు మెసేజ్ వచ్చింది. సందేహం వచ్చి తనవద్దనున్న ఏటీఎంను పరిశీలించగా.. మారిపోయినట్లు గుర్తించి తెలుసుకుని వెంటనే బత్తలపల్లి పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు ఫిర్యాదు స్వీకరించకుండా నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో చేసేదిలేక వెనుదిరిగివచ్చాడు. చివరకు తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన టీడీపీ నాయకులు ధనుంజయ వచ్చి పోలీసులతో మాట్లాడితేగానీ కేసు నమోదు చేయలేదు. శుక్రవారం కేసు నమోదు చేసి డబ్బులు ఎక్కడెక్కడ డ్రా చేసిందీ పరిశీలించారు. బత్తలపల్లి పెట్రోలు బంకు వద్దకు వెళ్లి సీసీ కెమెరాలలో నమోదైన ఫుటేజీలను పరిశీలించారు.