cash fraud
-
అమాయకులే టార్గెట్
రెచ్చిపోతున్న అపరిచిత వ్యక్తులు ఏటీఎం కార్డు ఏమార్చి నగదు డ్రా ధర్మవరం అర్బన్ : అమాయకులను లక్ష్యంగా చేసుకుని అపరిచిత వ్యక్తులు రెచ్చిపోతున్నారు. డబ్బు డ్రా చేయిస్తామని నమ్మబలికి వారి పిన్ నంబర్ తెలుసుకుని, అనంతరం ఏటీఎం కార్డులు మార్చేసి.. తాపీగా ఖాతాలోంచి నగదును కొల్లగొడుతున్నారు. ఇటీవల బత్తలపల్లిలో జరిగిన సంఘటనను మరువకముందే మరొకటి ధర్మవరంలో వెలుగు చూసింది. ఆలస్యంగా గుర్తించిన బాధిత మహిళలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ధర్మవరం పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన స్వరూపరాణి తన తల్లి అంజినమ్మతో కలిసి ఈ నెల 13న కళాజ్యోతి సర్కిల్లోనున్న ఎస్బీఐ ఏటీఎం వద్దకు డబ్బు డ్రా చేసేందుకు వెళ్లారు. అక్కడ ఏటీఎంలో డబ్బు రాకపోవడంతో చాలాసేపు ఇబ్బంది పడ్డారు. పక్కనే ఉన్న ఓ అపరిచిత వ్యక్తి తాను డ్రా చేసిస్తాను అని వీరివద్దనుంచి ఏటీఎం కార్డు తీసుకుని, పిన్ నంబర్ కనుగొన్నాడు. అనంతరం ఈ ఏటీఎంలో డబ్బు లేదు.. మరొకదాని వద్దకు వెళ్లండని సూచిస్తూ.. వారి ఏటీఎం కార్డును మార్చి మరొకటి ఇచ్చాడు. ఆ మహిళలు కార్డును గమనించకుండా తీసుకుని, నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం బ్యాంకుకు వెళ్లి పాస్‌బుక్‌లో వివరాలు నమోదు చేయించగా రూ.58 వేల వరకు తమకు తెలియకుండానే నగదు డ్రా చేసినట్లు వచ్చింది. తాము మోసపోయామని గుర్తించిన మహిళలిద్దరూ వెంటనే పట్టణ సీఐ హరినాథ్‌కు ఫిర్యాదు చేశారు. అపరిచిత వ్యక్తి గుంటూరు జిల్లాలోని ఓ ఏటీఎంలోను, ఆ తర్వాత పెట్రోల్ బంకుల్లోను స్వైప్ మిషన్ ద్వారా ఈ నగదు డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఏటీఎం ఏమార్చి.. రూ.30వేలు కాజేసి..!
బత్తలపల్లి : ఓ అమాయకుడిని ఏమార్చి అతడి ఏటీఎంను అపహరించి, ఆ తర్వాత దానితో రూ.30వేలు డ్రా చేసుకున్న ఘనుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల ఎనిమిదో తేదీన నార్పల మండలం గుంజేపల్లికి చెందిన శివారెడ్డి తనకు డబ్బులు అవసరముండి బత్తలపల్లిలోని కార్పొరేషన్ బ్యాంకు వద్దనున్న ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అయితే డబ్బు డ్రా చేయడం తెలీక ఇబ్బంది పడుతుండటంతో ఓ అపరిచిత వ్యక్తి అక్కడకు వచ్చాడు. అతడిని శివారెడ్డి సాయం చేయాలని కోరాడు. తొలుత రూ.10 వేలు తీసుకున్నాడు. అనంతరం మరో రూ.5వేలు కావాలని అడగగా డబ్బులు తీసిన తర్వాత ఏటీఎంను మార్చి ఇచ్చాడు. అనంతరం ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత అపరిచిత వ్యక్తి కదిరి రోడ్డులోని పెట్రోలు బంకులో సిబ్బందితో కుమ్మక్కై స్వైప్ మిషన్ ద్వారా వారి ఖాతాలోకి నగదు ట్రాన్స్ఫర్ చేసి రూ.25వేలు, మరో చోట రూ.5వేలు డ్రా చేసుకున్నాడు. ఈ సమాచారం శివారెడ్డి సెల్‌కు మెసేజ్ వచ్చింది. సందేహం వచ్చి తనవద్దనున్న ఏటీఎంను పరిశీలించగా.. మారిపోయినట్లు గుర్తించి తెలుసుకుని వెంటనే బత్తలపల్లి పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు ఫిర్యాదు స్వీకరించకుండా నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో చేసేదిలేక వెనుదిరిగివచ్చాడు. చివరకు తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన టీడీపీ నాయకులు ధనుంజయ వచ్చి పోలీసులతో మాట్లాడితేగానీ కేసు నమోదు చేయలేదు. శుక్రవారం కేసు నమోదు చేసి డబ్బులు ఎక్కడెక్కడ డ్రా చేసిందీ పరిశీలించారు. బత్తలపల్లి పెట్రోలు బంకు వద్దకు వెళ్లి సీసీ కెమెరాలలో నమోదైన ఫుటేజీలను పరిశీలించారు.