కన్నతండ్రి కర్కశత్వం
♦ నాలుగేళ్లకే నరకయాతన
♦ బంధించి చితకబాదిన తండ్రి
♦ టీచర్ ఆరాతో వెలుగుచూసిన ఘటన
♦ పురిట్లోనే తల్లిని కోల్పోయిన పవిత్ర
చిన్నశంకరంపేట: పాపం ఈ చిన్నారి పురిట్లోనే తల్లిని కోల్పోయింది. కంటికి రెప్పలా చూడాల్సిన తండ్రి కఠినాత్ముడిగా మారాడు. అల్లారుముద్దుగా పెరగాల్సిన ఈ చిన్నారి.. పుట్టెడు కష్టాలను అనుభవిస్తోంది. నాలుగేళ్ల చిన్నారితో బండచాకిరి చేయిస్తున్నాడు. అదీగాక చితకబాదుతూ నరకం చూపిస్తున్నాడు. టీచర్ ఆరాతో మంగళవారం కన్నతండ్రి కర్కశత్వం వెలుగు చూసింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జప్తిశివనూర్‌కు చెందిన జెట్టి నరేష్, రేణుక దంపతులు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన వెంటనే రేణుక కన్నుమూసింది. చిన్నారికి పవిత్ర అనే పేరు పెట్టారు.
కానీ పవిత్రను వదిలించుకునేందుకు అప్పట్లోనే తండ్రి బయటకు విసిరేశాడు. బతికి బయటపడ్డ పవిత్ర ఆ వెంటనే నానమ్మ, తాతయ్యల చెంతకు చేరింది. తండ్రి నరేష్ హెచ్చరికలతో తాతయ్య, నానమ్మలు ఊరు విడిచివెళ్లారు. తండ్రి నరేష్ అదిరింపులు బెదిరింపులతో చిన్నారి రోజూ నరకం చూస్తోంది. బంధువులు మందలించినా ఫలితంలేకపోగా, అతను మరింత కర్కశత్వంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ చిన్నారి స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. తాజాగా మూడు రోజులు వరుసగా పాఠశాలకు సెలవులు రావడంతో చిన్నారి నరకం చూడాల్సి వచ్చింది. ఇంట్లో బాసండ్లు తోమడంతోపాటు బట్టలు ఉతకాలంటూ చిన్నారిని ఎక్కడ పడితే అక్కడ వాతలు వచ్చేలా చితకబాదాడు. ఇంట్లో బంధించాడు.
అరిస్తే ఇంకా ఎక్కువగా కొడతానని బెదిరిస్తూ మూడు రోజులుగా చితకబాదడంతో చిన్నారి ఒళ్లు హూనమైంది. మంగళవారం పాఠశాలకు రాగా, ముభావంగా కన్పించింది. చిన్నారి పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయురాలు ఏం జరిగిందని ఆరా తీశారు. బాధను భరించలేక ఆ చిన్నారి గొల్లుమని ఏడ్చేసింది. హెచ్‌ఎం చంద్రమౌళి, ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ఈ విషయాన్ని శిశు సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. సంగారెడ్డిలోని శిశు సంరక్షణ కేంద్రం అధికారి విఠల్ చిన్నారిని సంగారెడ్డిలోని బాలసదన్‌కు తరలించారు.