
రోడ్డు ప్రమాదంలో మహిళా ఉద్యోగి మృతి
చింతలపూడి : ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చునని భావించిన ఒక మహిళా ఉద్యోగిని రోడ్డు ప్రమాదానికి గురై మృత్యు ఒడికి చేరిన ఘటన చింతలపూడిలో చోటు చేసుకుంది. కుక్కునూరి సునీత మండలంలోని తిమ్మిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. శనివారం ఉదయం 6 గంటలకు తిమ్మిరెడ్డిపల్లి గ్రామం చేరుకుని పెన్షన్లు పంపిణీ చేసింది. 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై చింతలపూడి బయలుదేరింది. మార్గమధ్యంలో ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చేర్చిన కొద్ది సేపటికి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సునీత రెండేళ్ల నుంచి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నట్టు ఈవోపీఆర్‌డీ డి.రాజగోపాల్ చెప్పారు. ఆమె భర్త యానాంలో రిలయన్స్ కంపెనీలో పని చేస్తున్నారని, తల్లిదండ్రులు ద్వారకా తిరుమలలో ఉంటున్నట్టు తెలిపారు. వారికి సమాచారం అందించినట్టు చెప్పారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. ఎస్సై సైదానాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మిన్నంటిన విషాదం
రోడ్డు ప్రమాదంలో తోటి ఉద్యోగి మృతి చెందిన ఘటన ఉద్యోగవర్గాల్లో విషాదం నింపింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ తమతో గడిపిన సహ ఉద్యోగి దుర్మరణాన్ని వారు జీర్ణించుకోలేక క౦ట తడి పెట్టారు.