
జూనియర్ పై సీనియర్ విద్యార్థుల దాడి
హైదరాబాద్: పాఠశాల విద్యార్థులు తరగతిగదిలోనే గుండాల తరహాలో తోటి విద్యార్థిపై దాడిచేసిన ఘటన జరిగిన మరుసటిరోజే అలాంటి ఉదంతం మరొకటి చోటుచేసుకుంది. చైతన్య కాలేజీ హాస్టల్ లో జూనియర్స్, సీనియర్స్ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన నగరంలోని అంబర్ పేట డీడీకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. చైతన్య కాలేజీలో జూనియర్ విద్యార్థి అయిన వర్ధన్ పై సీనియర్ విద్యార్థులు చేయి చేసుకోవడంతో వివాదం మొదలైంది.
విషయం తెలుసుకున్న జూనియర్స్ వర్ధన్ కు మద్ధతుగా రావడంతో సీనియర్స్ మరింతగా రెచ్చిపోయారు. సీనియర్ల చేతిలో వర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడ్డ వర్ధన్ ను తొలుత ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రి నుంచి హిమయత్ నగర్ అపోలోకు వర్ధన్ ను తరలించారు. ముఖ్యంగా ముగ్గురు విద్యార్థులు వర్ధన్ పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని అతడి బంధువులు చెబుతున్నారు. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.