కడప రూరల్:
సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాటం చేస్తామని అఖిలపక్ష నేతలు తెలిపారు. అన్నదాతలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అధ్యక్షతన.. శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగులు నీటిని నిల్వ ఉంచి కేసీ కెనాల్, గండికోట, బ్రహ్మంసాగర్‌లకు విడుదల చేయాలనే డిమాండుతో అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అన్నదాతలు అవస్థలు పడుతున్నా, శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లున్నా, ఎందుకు నిల్వ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయకుండా వృథాగా దిగువకు వదిలి వేయడంలో పరమార్థం ఏమిటో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాపై ఎందుకంత వివక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కడప మేయర్ సురేష్‌బాబు, జెడ్పీటీసీ సభ్యులు వీరారెడ్డి, సురేష్ యాదవ్, శివకుమార్‌రెడ్డి, పెద్ద సంఖ్యలో రైతు నాయకులు పాల్గొన్నారు.
29న మహాధర్నా:
శ్రీశైలం జలాల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 29న మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సమావేశంలో పాల్గొన్న అందరూ మద్దతు తెలిపారు. ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.
మన వాటా సాధించుకుందాం
మన వాటా నీటిని సాధించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలి. శ్రీశైలంలో నీళ్లున్నప్పటికీ నిల్వ చేయకుండా ఏదో ఒక సాకు చూపుతూ కిందికి వదలడం దారుణం. పాలకుల మెడలు వంచి రైతాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి.
– ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
బాబు దృష్టంతా అమరావతి పైనే
ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రంగాల్లో వెనుకబడిన రాయలసీమను పట్టించుకోకుండా.. దృష్టి అంతా అమరావతిపైనే కేంద్రీకరించడం అన్యాయం. ‘సీమ’కు రావాల్సిన నికర జలాలను వదలకుండా అడ్డు తగలడం శోచనీయం.
– నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు
ప్రశ్నార్థకంగా ఆయకట్టు సాగు:
ఎంతో పురాతనమైన కేసీ కెనాల్ కింద లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చుక్కనీరు విడుదల చేయకపోవడంతో కేసీ కెనాల్ కింద ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది.
– రామసుబ్బారెడ్డి, సీపీఐ, రైతు నాయకుడు
తెలుగు తమ్ముళ్ల ప్రగల్బాలు
కేసీ కెనాల్‌కు నీళ్లొస్తాయని కొంత మంది తెలుగు తమ్ముళ్లు ప్రగల్భాలు పలికారు. మరి శ్రీశైలంలో నీళ్లున్నా కేసీ కెనాల్‌లో ఏవీ? టీడీపీ నేతలు ఈ ప్రాంత ప్రజయోజనాల దృష్ట్యా మసలుకోవాలి.
– జీఎన్ భాస్కర్‌రెడ్డి, చెన్నూరు మండల రైతు నాయకుడు
ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ కృషి
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే అన్ని పార్టీల నేతలను కలుపుకుని రాయలసీమ ప్రయోజనాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన సీఎం అయ్యాక ప్రాజెక్టుల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేశారని, మిగిలిన కొద్దిపాటి పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టడం లేదు.
– ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి, సీపీఐ
అన్నదాతలను ఆదుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం కేసీ కెనాల్, గండికోట తదితర ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకపోవడంతో ఎన్నడూ లేని విధంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వారు ఎందుకో మరి ఇసుమంతైనా చలించడం లేదు. అన్నదాతలను ఆదుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా వెనుకాడం!
– సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం
పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం
నీటి కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలి. అందుకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు తరలి రావాలి. జాతీయ రహదారులను దిగ్బంధం చేసి పాలకులకు కనువిప్పు కలిగించేలా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాంతాలపై కొనసాగుతున్న వివక్ష ఎంతమాత్రం తగదు. శ్రీశైలంలో నీళ్లున్నా ప్రభుత్వం వదలడం లేదంటే ఏమని అర్థం చేసుకోవాలి. ఈ పాలకులకు రైతు సంక్షేమం పట్టదా?
– సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, కార్మిక, కర్షక నేత
––––