జనగామ జిల్లా పోరు ఉద్రిక్తం
-
జనగామలో ఉగ్రరూపం దాల్చిన ఆందోళన
-
ఐదు గంటల పాటు హైవే దిగ్బంధం
-
జేఏసీ, మహిళా, విద్యార్థి నాయకుల అరెస్టు
జనగామ : జిల్లాల ప్రతిపాదనలో జనగామకు జరిగిన అన్యాయానికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జనగామ జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపుతో వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు 144 సెక్షన్ విధించినా దానిని ఖాతరు చేయకుండా సకల జనులు రోడ్లపైకి చేరుకున్నారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్ సబ్ డివిజన్ల పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి గురువారం రాత్రి నుంచే జనగామను ఆధీనంలోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటలకే జేఏసీ నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని నిద్రలేపి అరెస్ట్ చేశారు. దీంతో జనగామ డివిజన్ అట్టుడికింది.
పోలీసుల కళ్లు గప్పి..
ముందుగా టీఆర్‌ఎస్‌కు చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకారులు పోలీసుల కళ్లుగప్పి చౌరస్తాకు చేరుకున్నారు. ఆ తర్వాత జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి వందలాది మందితో కలిసి సిద్ధిపేట రోడ్డు మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఇంతలోనే కుర్మవాడ నుంచి 200 మంది మహిళలు బోనాలతో జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడ మహిళా పోలీసులు ఇద్దరే ఉండడంతో అరెస్టు చేసేందుకు ఐదు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.
మరోవైపున జేఏసీ నాయకులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు. దశమంతరెడ్డి కాలర్ పట్టుకుని లాగారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మేకల కళింగరాజు, కౌన్సిలర్లు ఆకుల వేణు, బెడిదె మైసయ్య, జనార్దన్‌రెడ్డి, ఎజాజ్, విద్యార్థి సంఘ నాయకులు మాజీద్, మంగళ్లపల్లి రాజును బలవంతగా ఈడ్చుకెళ్లారు. మహిళలు, వృద్ధులను సైతం లాగి వాహనాల్లోకి ఎక్కించారు. దీంతో జేఏసీ నాయకులు–పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎస్‌ఐ సంతోషం రవీందర్‌పై జేఏసీ నేతలు మండిపడ్డారు.
పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు
అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ మహిళలు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. జనగామ జిల్లా తమ హక్కని, ఇవ్వకుంటే నాయకులను అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, స్టేషన్ లోపలికి తరలించే క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.