బల్లిపర్రులో నాలుగు పూరిళ్లు దగ్ధం
బల్లిపర్రులో నాలుగు పూరిళ్లు దగ్ధం
Published Wed, Oct 5 2016 9:26 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
బల్లిపర్రు (గన్నవరం రూరల్) :
తెంపల్లె శివారు గ్రామం బల్లిపర్రులో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన లోయ జేజేరావు, సాంబశివరావు, మురళీకృష్ణ గృహాలతో పాటు సాంబశివరావుకు చెందిన గేదెల పాక మంటల్లో కాలిపోయింది. జేజేరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించటంతో అతని తలభాగం కాలినట్లు స్థానికులు చెప్పారు. మంటల్లో చిక్కుకున్న జేజేరావును బంధువులు బయటకు తీసుకువచ్చారు. గాయపడిన జేజేరావును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. జేజేరావు ఇంట్లో రూ.లక్ష నగదు, 4 కాసుల బంగారం, దస్తావేజులు, సాంబశివరావు ఇంట్లో రూ.20 వేల నగదు, దస్తావేజులు, రెండు కాసుల బంగారం, మురళీకృష్ణ ఇంట్లో 4.5 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులు, 2,500 నగదు, బంగారు ఉంగరాలు, దుస్తులు తదితరాలన్నీ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో జేజేరావు ఇంట్లోని గ్యాస్ సిలిండరు పేలిందని గ్రామస్తులు చెప్పారు. జేజేరావు ఇంటి నుంచి ఎగసిపడిన మంటలు గ్రామస్తులు అప్రమత్తమయ్యేలోపు మిగిలిన ఇళ్లను చుట్టుముట్టాయి. గన్నవరం అగ్ని మాపక శకటం వచ్చి మంటలను అదుపు చేసింది. ఇదే ప్రమాదంలో సమీపంలోని వీర్ల సీతారామయ్య ఇంటి పైకప్పుకు నిప్పు అంటుకోగా గ్రామస్తులు పైకప్పు తాటి ఆకులను పీకేశారు. సంఘటన స్థలాన్ని సర్పంచ్ నిమ్మకూరి విజయ్‌కుమార్, వీఆర్వో వెంకటేశ్వరరావు తదితరులు సందర్శించారు. ప్రమాద నష్టం రూ.10 లక్షలు ఉంటుందని గ్రామస్తులు చెప్పారు.
Advertisement