శంషాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఎనిమిది అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం దాదాపు ఆరు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు.. ఎనిమిది అంతస్తుల భవనంలో అనుపమ రెసిడెన్సీ లాడ్జీని నిర్వహిస్తున్నారు. కొన్ని ఫ్లోర్లను ఇతర పనులకు అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో నేటి ఉదయం భవనంలోని రెండో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు ప్రారంభమయ్యాయి. అంతలోనే మరో మూడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. లాడ్జీలో 50 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం.
తొలుత స్థానికుల సాయంతో కేవలం హోటల్ సిబ్బంది స్వయంగా మంటలు ఆర్పేందుకు తీవ్ర యత్నాలు చేసింది. అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మూడో అంతస్తులో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి మంటల్లో కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది ఆ హోటల్లో ఉన్న వారిని సురక్షితంగా భయటకు చేర్చింది. కొంత సమయం శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే ఈ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయటకు వెళ్లేందుకు ఉండే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదని స్థానికులు చెబుతున్నారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.