గాయపడిన వ్యక్తిని పరామర్శిస్తున్న సీఐటీయూ నాయకులు
రణస్థలం : మండలంలోని పైడిభీమవరం గ్రామం వద్ద ఉన్న అరబిందో పరిశ్రమ ఆరో బ్లాక్‌లో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే...ప్రొడక్షన్ బ్లాక్ ఆరులో కార్మికులు పని చేస్తున్న సమయంలో ఫైర్ కావంతో రణస్థలం మండలం చిల్లపేట గ్రామానికి చెందిన ఆశ రామకృష్ణ(22), కోష్ట గ్రామానికి చెందిన సీహెచ్ వెంకటరమణకు గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా వీరిని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి పి.తేజేశ్వరరావు పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మిక భద్రతను పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పైడిభీమవరంలో ఆధునిక సదుపాయాలతో వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించి కార్మికులకు వైద్యం అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. హైడ్రాలిక్ ఫోమ్ ఫైరింజన్‌లను పరిశ్రమల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట సంఘ నేతలు సీతారామరాజు, బి.శ్రీనివాసరావు, పి.వెంకటప్పారావు, జె.శ్యామలరావు ఉన్నారు.