ప్లాస్టిక్ సంచుల గోదాములో అగ్నిప్రమాదం
డోన్ టౌన్ : పట్టణ శివారులోని వైఎస్సార్ విగ్రహం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న లక్ష్మీవెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ప్లాస్టిక్ సంచుల గోదాములో ఆదివారం ఉదయం 5గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. యజమాని ఎరుకలి సుంకన్న కథనం మేరకు.. గోదాములో విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. గత వారం రూ. 15లక్షల సరుకును బెంగళూరు నుంచి తెప్పించుకుని నిల్వ ఉంచగా సుమారు రూ. 12 లక్షల సరుకు కాలిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక కేంద్ర ప్రధాన అధికారి మద్దిలేటి ఆధ్వర్యంలో సిబ్బంది గోపాల్, రామాంజనేయులు, గోవిందరాజు, సుంకన్న, నారాయణ ఫైరింజిన్‌తో వచ్చి మంటలను ఆర్పివేయడంతో ఆస్తి నష్టం తగ్గింది. జిల్లా అగ్నిమాపక కేంద్ర అధికారి బాలరాజు ఉదయం 7గంటల సమయంలో ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించారు. గోదాము యజమాని ఎరుకలి సుంకన్న, అగ్నిమాపక అధికారి మద్దిలేటితో మాట్లాడి ప్రమాదానికి కారణాలు, జరిగిన నష్టం తదితర వివరాలు తెలుసుకున్నారు.