తుపాను గుప్పెట్లో బోట్లు!
తుపాను గుప్పెట్లో బోట్లు!
Published Sat, Dec 10 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
సముద్రంలోనే కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు
అనుకున్న సమయానికి తీరం చేరటం కష్టమని బంధువుల ఆందోళన
పిఠాపురం : వార్దా తుపాను తీవ్రమవుతున్న తరుణంలో కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన 30 బోట్లు సముద్రంలో చిక్కుకోవడం మత్స్యకార కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ బోట్లలో వేటకెళ్లిన సుమారు 160 మంది వరకు మత్స్యకారులు ఉండడంతో వారి బంధువులు భయపడుతున్నారు. తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశం వుందని చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారే తప్ప ఆ హెచ్చరికలు నడిసముద్రంలో ఉన్న మత్స్యకారులకు చేరే అవకాశం మాత్రం కనిపించడం లేదు. మత్స్యకారులందరి వద్ద సెల్‌ఫోన్లు ఉన్నా సుదూర ప్రాంతం కావడంతో సెల్‌ఫోన్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయానికి తప్పక తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తుండగా సుమారు 150 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మత్స్యకారులకు ఆ సమాచారం అంది, వారు వేటను నిలిపివేసి తిరిగి ప్రయాణం అయినా తీరానికి చేరుకోవడానికి సుమారు 24 గంటల నుంచి 36 గంటలు పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుపానులో చిక్కుకునే అవకాశం ఉందని మత్స్యకారుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.
ఉప్పాడలో కడలి కన్నెర్ర
తుపాను ప్రభావంతో ఉప్పాడ సమీపంలోని తీరప్రాంతం వెంబడి ఉన్న బీచ్‌రోడ్డు కడలి ఆగ్రహానికి గురై ముక్కలైంది. దీంతో కాకినాడ–ఉప్పాడల మధ్య బీచ్‌రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. శుక్రవారం ఉదయం నుంచి సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. తీరంలో కెరటాలు సుమారు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతూ తీరప్రాంతాన్ని తీవ్ర కోతకు గురిచేస్తున్నాయి. తీరానికి సమీపంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. బలమైన ఈదురుగాలులు ఈ ప్రాంతంలో మత్స్యకారుల గృహాలను ధ్వంసం చేస్తున్నాయి.
అందరికీ సమాచారం అందించే ఏర్పాట్లు చేశాం
సముద్రంలో చేపల వేటలో ఉన్న మత్స్యకారులకు ఇప్పటికే సమాచారం అందించాం. చాలాబోట్లు ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్నాయి. ఇంకా 30 వరకు బోట్లు ఒడ్డుకు చేరుకోవాలి. అవి శనివారం ఉదయానికి తప్పక చేరుకుంటాయి. మత్స్యకారులకు సంబంధించినంత వరకు అందరి ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సాంకేతికపరమైన పరికరాలతో సమాచారం అందించే ఏర్పాట్లు చేశాం. ఎవరికైనా సమాచారం అందకపోతే తక్షణం చర్యలు తీసుకునే విధంగా మత్స్యఖాధికారులను అప్రమత్తం చేశాం. మత్స్యకార కుటుంబీకులు ఎవరు ఆందోళన పడాల్సిన పనిలేదు.
– అంజలి, మత్స్యశాఖ డీడీ, కాకినాడ
Advertisement
Advertisement