పిడుగు.. కన్నీటి మడుగు
పిడుగుపాటుకు ఐదుగురి మృతి
ఈత కొలనులో మునిగి బాలుడు, ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం
పిచ్చాటూరు/రామసముద్రం/శ్రీకాళహస్తి రూరల్/చిత్తూరు (అర్బన్): జిల్లాలో ఆదివారం పలు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పిడుగుపాటుతో ఐదుగురు, ఇంటి సన్‌సైడ్ గోడ కూలి ఓ చిన్నారి, స్విమ్మింగ్‌పూల్‌లో పడి మరో బాలుడు ప్రాణాలు విడిచారు. వీరిపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
మెరుపులాంటి విషాదం
జిల్లాలోని వివిధ మండలాల్లో పిడుగు పడి ముగ్గురు మృతిచెందారు. పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం కళత్తూరు గ్రామానికి చెందిన వెంకటరత్నం(55)కు ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు వెంకటేశులు(20) పొలం పనిచేస్తుండగా, చిన్నకొడుకు చెంగల్రాయులు(16) పదో తరగతి పూర్తిచేశాడు. శనివారం వెలువడిన పది ఫలితాల్లో విజయం సాధించి సంబరాలు చేసుకున్నాడు. మూడో వాడు మతిస్థిమితం లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. వెంకటరత్నం పొలం వద్ద కాలువలు చదును చేయడానికి ఆదివారం తన ఇద్దరు కొడుకులతో కలిసి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. వారు పనిచేస్తున్న ప్రదేశంలోనే పిడుగుపడడంతో అక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి వారిని హుటాహుటిన కేవీబీపురం ఆస్పత్రికి తరలించారు. తండ్రి వెంకటరత్నం, అన్న వెంకటేశులు కోలుకోగా, చెంగల్రాయులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చెంగల్రాయులు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పది పాసైన సంతోషం తమకు ఎక్కువకాలం నిలవలేదని తల్లిదండ్రులు బోరున విలపించారు.
రామసముద్రం.. కన్నీటి సంద్రం
రామసముద్రం మండలంలో ఆర్.నడుంపల్లె పంచాయతీ దిగువబొంపల్లెకు చెందిన ఆర్.నరసింహులు(50), అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప భార్య లక్ష్మీదేవమ్మ మేకలు మేపేందుకు సమీపంలోని వాలీశ్వరస్వామి కొండకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నరసింహులుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మీదేవమ్మకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే తిరుమలరెడ్డిగారిపల్లెకు చెందిన వెంకటరమణ భార్య ఆదిలక్ష్మి(37) సందూరి చెరువు కింద మల్బరీ ఆకు కోసుకొచ్చేందుకు వెళ్లింది. పిడుగుపడడంతో ఆమె గాయపడింది. పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూసింది.
రైతు కుటుంబాల్లో విషాదం
శ్రీకాళహస్తి మండలం భీమవరానికి చెందిన బి.రమణయ్య(45), బి.నరసింహులు(55) మేకలు మేపుకుని జీవిస్తున్నారు. ఆదివారం మేతకోసం మేకలను అడవికి తీసుకెళ్లారు. అయితే చీకటి పడ్డాక మేకలు మాత్రమే ఇంటికి వచ్చేశాయి. ఎంతసేపటికీ వారు రాకపోవడంతో స్థానికులు అడవిలోకి వెళ్లి గాలించారు. పిడుగుపడి ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని గుర్తించి మృతదేహాలను గ్రామంలోకి తీసుకొచ్చారు.
గుండెకోతే మిగిలింది..
సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్న త్రివిక్రమ్‌రెడ్డి, వంశీప్రియలది పూతలపట్టు మండలం. వేసవి సెలవులు కావడంతో తమ ఒక్కగానొక్క కొడుకును పూతలపట్టులోని స్వగ్రామానికి పంపారు. రిషి శనివారం చిత్తూరులోని కట్టమంచిలో ఉంటున్న తన బాబాయి వినీల్ ఇంటికి వచ్చాడు. ఆదివారం అతనితో కలిసి ఈత నేర్చుకోవడానికి డీఎస్‌డీవో (జిల్లా క్రీడాభివృద్ధి శాఖ)కు చెందిన స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లాడు. అప్పటికే 30మంది స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొడుతుండగా రిషి సైతం దూకేశాడు. ఊపిరాడక మృతి చెందాడు.
ఆశలు ఆవిరి..
కేవీబీపురం మండలం మఠం గ్రామానికి చెందిన గజేంద్ర, సాయమ్మ దంపతులు పాత మిద్దెలో నివాసముంటున్నారు. వారి కుమార్తె మానస(1)ను బంధువుల పిల్లలు తేజస్విని, తులసి, పవిత్ర, కావ్య ఇంటి వరండాలో ఉన్న సన్‌సైడ్‌కు కట్టిన ఊయలలో ఉంచి ఊపుతున్నారు. ఊయల కట్టి ఉన్న సన్‌సైడ్ కూలి పిల్లలపై పడింది. చిన్నారి మానస అక్కడికక్కడే మృతి చెందింది. తేజశ్వని, తులసి, పవిత్ర, కావ్య గాయపడ్డారు.