వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
రూ.4 లక్షల విలువైన బంగారం స్వాధీనం
మంగళగిరి: వివిధ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. పట్టణంలోని నార్త్ సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు.
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన మచ్చా రవీంద్రరెడ్డి, మంగళగిరి పాత కరెంట్ ఆఫీసు సెంటర్‌లో నివాసముంటున్న తోట సాయి, కోనేరు వీధికి చెందిన ఒంటిపులి సుధాకర్, పిడుగురాళ్ళ కుమ్మరిపాలెంకు చెందిన సులగా వెంకటేశ్వర్లు, నవులూరుకి చెందిన మైనేని సాయి.. చెడు వ్యసనాలకు బానిసలై చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. విజయవాడ ఆటోనగర్ ఏరియాలో రెండు, పెదకాకానిలో ఒకటి, తాడికొండ లాం వద్ద ఒకటి, మంగళగిరిలో మూడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకునిబంగారు గొలుసులు లాక్కుని పరారవుతుంటారు. పట్టణంలోని జాతీయ రహదారి వద్ద బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు అందిన సమాచారంతో పట్టణ సీఐ బొప్పన బ్రహ్మయ్య, తన సిబ్బందితో కలిసి ఐదుగురు నిందితులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షలు విలువచేసే 17 సవర్ల బంగారు చైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేస్తామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు.