
వీరజవాన్ కుటుంబసభ్యులను సత్కరిస్తున్న కేంద్రమంత్రి
నాంపల్లి: జాతిని ఏకం చేసేది తిరంగా జెండా ఒక్కటేనని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జై జవాన్ తిరంగా ఉత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ.. వీర జవాన్, జాతీయ జెండాను చూస్తే ఏ ఒక్కరిలో కులం, మతం, వర్గం, ప్రాంతం అనే బేధాభిప్రాయాలు రావని గుర్తు చేశారు. దేశ భద్రత, సమగ్రత, సమైక్యతకు ప్రధాని నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. యుద్ధం లో గెలవలేని పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని విమర్శించారు.
ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో స్నేహంగా ఉండేందుకు చర్చలు జరిపి అదుపులోకి తేవాలని భారత్ ఆలోచిస్తోందన్నారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన పద్మఫణి చార్య కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్రంతో మాట్లాడి ప్లాట్‌ను ఇప్పిస్తామని చెప్పారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ...
దేశ ప్రధాని చేపట్టిన జై జవాన్ తిరంగా ఉత్సవ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పేర్కొన్నారు. అనంతరం పలువురు వీర జవాన్ల కుటుంబ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో ఎయిర్ వే మేజర్ ప్రకాష్ రావు, మేజర్ జనరల్ గోర్తి, మేజర్ ప్రభాకర్‌రెడ్డి, కల్నల్ రవి చౌదరి, గుప్తా, కాశీ తదితరులు పాల్గొన్నారు.