భక్తజన ప్రవాహం
భక్తజన ప్రవాహం
Published Fri, Aug 19 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
సంగమేశ్వరంలో కొనసాగుతున్న రద్దీ
– ఘాట్ల వద్ద తగ్గిన నీటి మట్టం
– ఏపీ టూరిజం రెస్టారెంట్ ప్రారంభం
సంగమేశ్వరం(ఆత్మకూరు): కృష్ణా తీరంలో భక్తజన ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. సంగమేశ్వర క్షేత్రం వద్ద పుణ్య స్నానాలతో భక్తులు తరిస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న భక్తులు నదీ ప్రవాహం చూసి తమను తాము మైమరిచిపోతున్నారు. పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని పరవశిస్తున్నారు. క్షేత్ర పరిధిలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇకపోతే సంగమేశ్వరం వద్ద కృష్ణా జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఘాట్ల వద్ద శుక్రవారం మూడు అడుగుల మేర నీరు తగ్గింది. లలితాదేవి ఘాట్ వద్ద మెట్లపై కూర్చొని స్నానం చేసేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఘాట్‌ల వద్ద రద్దీ కనిపించింది. అయితే రెండు రోజులుగా వీఐపీల తాకిడి తగ్గింది. ఈ ఘాట్‌కు సమీపంలో 4 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ రాష్ట్రంలో కొలువైన సోమశిల క్షేత్రం వద్ద వీఐపీలు, సినీ తారల సందడి అధికంగా ఉంది.
ప్రారంభమైన ఏపీ టూరిజం రెస్టారెంట్
సంగమేశ్వరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం రెస్టారెంట్‌ను జేసీ హరికిరణ్ ప్రారంభించారు. పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి గురువారం రోజు వరకు ఇక్కడ ఎలాంటి క్యాంటీన్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. దారి వెంట తెచ్చుకున్న తినుబండారాలతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. తాజాగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్ క్షేత్రానికి వచ్చే భక్తులతో పాటు సోమశిల ప్రయాణికులకు ఉపయుక్తం కానుంది. ప్రస్తుతం టీ, టిఫెన్‌కే పరిమితమైనా.. త్వరలో శాఖాహార భోజన సదుపాయం కల్పించనున్నారు.
ట్రాఫిక్ క్రమబ్ధకరణ
భక్తుల రద్దీ దృష్ట్యా పార్కింగ్ ప్రాంతంతో పాటు రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. పోలీసులతో పాటు వాలంటీర్లు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు శ్రమించారు. కపిలేశ్వరం గ్రామ సమీపంలో ఆటోలు, ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు, మోటార్ సైకిళ్లను నిలిపేసి పార్కింగ్ చేయించారు. అన్ని ప్రాంతాలకు చెందిన బస్సులను పుష్కరనగర్‌కు అనుమతించారు. ఇక్కడి నుంచి భక్తులు ఉచిత బస్సుల్లో సంగమేశ్వరం చేరుకుంటున్నారు.
Advertisement