ఎన్నికల నియమావళి పాటించండి
Published Fri, Aug 9 2013 1:37 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కలెక్టరేట్’మచిలీపట్నం), న్యూస్‌లైన్ : అవనిగడ్డ శాసనసన ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి సూచించారు. ఉప ఎన్నికకు సంబంధించి గుర్తింపు పొం దిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీలో ఉన్న అభ్యర్థులతో కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఏ పార్టీనైనా, అభ్యర్థైనా ఉల్లంఘిం చినట్లు తెలిస్తే తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు. విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియావళి ఉల్లంఘన విషయంలో ఎవరైనా ఫిర్యా దు చేయదలిస్తే అవనిగడ్డలో రిటర్నింగ్ అధికారికి, బందరు ఆర్డీవోకు, మండలస్థాయిలో తహశీల్దార్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలింగ్ ఏజెంట్లను నియమించే సందర్భంలో ఏజెంటుగా ప్రతిపాదించబడిన వ్యక్తి గత చరిత్ర వివరాలను పోలీసులు విచారించి పంపిన నివేదిక ఆధారంగానే నియామకం జరుగుతుందని తెలిపారు. కాబట్టి అభ్యర్థులు ఏజెంట్ల నియామకం విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ఉద్యోగుల సమ్మె గురించి కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారన్నారు. నాన్ నెగోషియబుల్ అంశమని కలెక్టర్ చెప్పారు.
ఎన్నికల విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయచందర్ మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో 241 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ పేపరు సిద్ధం చేశామన్నారు. 1060 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించామన్నారు. 13, 17 తేదీల్లో మచిలీపట్నం హిందూ కళాశాలలోని శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
అవనిగడ్డ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి జి.రవి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లా అంతటా అమలులో ఉందని తెలిపారు. కులాలు, మతాలు ప్రాతిపదికగా ఓటర్లను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థి ప్రచారానికి రూ. 16 లక్షల వరకు ఖర్చు చేయవచ్చునన్నారు. ఎన్నికల ప్రచారం 19వ తేదీ సాయంత్రం 5గంటలకు ముగించాలన్నారు. పార్టీ ప్రతినిధులు కొడాలి శర్మ, అంబటి శ్రీహరిప్రసాద్, రావు సుబ్రమణ్యం, ఎంవీవీ కుమార్‌బాబు, బందరు ఆర్డీవో పి.సాయిబాబు, అవనిగడ్డ తహశీల్దార్ వి.శ్రీనివాస్, కలెక్టరేట్‌లోని హెచ్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement