ఫుట్‌బాల్ క్రీడాకారిణులకు ఘనసన్మానం
Published Sun, Jul 31 2016 10:26 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
తాడితోట (రాజమహేంద్రవరం)
పుట్‌బాల్ క్రీడలో రాణించి అమెరికా ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి ఫుట్‌బాల్ అటలో మరిన్ని మెళకువలు నేర్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన క్రీడాకారిణులను ఘనంగా ఆదివారం సన్మానించారు. రాజమహేంద్రవరం దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న లంక సాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్విని ప్రియ రాజమహేంద్రవరం బైపాస్ రోడ్డులోని నెల్సన్ మెమోరియల్ చర్చిలో సండేస్కూల్ విద్యార్థులు. జిల్లా, రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో వారెన్నో విజయాలు సాధించారు. వారి ప్రతిభను గుర్తించిన మ్యాజిక్ బస్సు అనే స్వచ్ఛంద సేవా సంస్థ వారి అమెరికా పర్యటనకు ఏర్పాట్లు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 12 మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపిక కాగా వారిలో రాజమహేంద్రవరానికి చెందిన లంక శాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్విని ప్రియలు ఉన్నారు. జూలై 9వ తేదీన రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన శ్రావణి, అశ్వినిప్రియ అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, న్యూ జెర్సీలలో 15 రోజుల పాటు ఫుట్ బాల్ క్రీడలో ప్రత్యేక శిక్షణ పొందారు. అక్కడ జరిగిన వివిధ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించారు. స్వదేశానికి తిరిగివచ్చిన లంక సాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్విని ప్రియలను నెల్సన్ మెమోరియల్ చర్చి సంఘ సభ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు. నెల్సన్ మెమోరియల్ చర్చి పాస్టర్లు ఎం. మార్టిన్ లూథర్, రవి రాజ్‌కుమార్, కమలాకరరావు, సంఘ పెద్దలు యార్లగడ్డ సుందరరావు, సిర్రా యాకోబు, కొమ్ము ఏసు, అర్జున రావు, మహిళా సంఘం, యూత్ సంఘం, సండేస్కూల్ విద్యార్ధులు పాల్గొన్నారు.
Advertisement