చెన్నై కేంద్రంగా విదేశీమద్యం రవాణా
-
జిల్లాలో జోరుగా విక్రయాలు
నెల్లూరు (క్రైమ్) : చెన్నై కేంద్రంగా విదేశీ మద్యం జిల్లాకు గుట్టు చప్పుడు కాకుండా రవాణా జరుగుతుంది. రైళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా లక్షలాది రూపాయల విదేశీ మద్యం జిల్లాకు చేరుతుంది. జిల్లాకు చెందిన కొందరు ఈ వ్యాపారాన్ని చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. చెన్నైలోని బర్మాబజార్‌లో కొన్ని కస్టమ్స్ షాపుల్లో అనధికారికంగా విదేశీ మద్యంను విక్రయిస్తున్నారు. నెల్లూరు నుంచి చెన్నైకు వెళ్లే సీజన్‌బాయిస్ కస్టమ్స్ షాపుల్లో విదేశీ మద్యం(జానీవాకర్, గ్లాండ్‌ఫిచ్, హెన్నీస్సీ రెడ్‌వైన్, కూట్టిసార్ప్ బ్లెండెండ్ స్కాట్చ్ తదితరాల)ను కొనుగోలు చేసి అధిక ధరలకు జిల్లాలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ బేవరేజస్‌లో జానీవాకర్ రెడ్‌లేబుల్ (750 ఎంఎల్) ఫుల్‌బాటిల్ రూ 2,145 ఉండగా అదే కంపెనీకి చెందిన లీటర్ బాటిల్ (12 ఏళ్ల పురాతనం) బర్మాబజార్‌లో రూ.1520లకే, జానీవాకర్ డబుల్‌బ్లాక్ రూ.4, 225 ఉండగా రూ.3,500కు, జానీవాకర్ బ్లాక్‌లేబుల్ రూ.4,290 ఉండగా రూ.3,525కు లభ్యమవుతున్నాయి. వాటిని తీసుకువచ్చి జిల్లాలో ఒక్కో బాటిల్‌పై రూ.500 నుంచి రూ.700 వరకు లాభంతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అతి తక్కువ ధరకే విదేశీ మద్యం అందుబాటులోకి వస్తుండటంతో మందుబాబులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. జానీవాకర్ బ్రాండ్ 12 ఏళ్ల పురాతనమైనది కావడంతో కొనుగోళ్లు మరింతగా పెరుగుతున్నాయి. నెల్లూరుకు చెందిన కొందరు సీజనల్ బాయిస్ ప్రతి రోజు రైళ్లు, ప్రైవేటు ట్రావెల్స్‌ల్లో విదేశీ మద్యం బాటిళ్లను నెల్లూరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. నెల్లూరులోని పలు కస్టమ్స్ షాపుల్లో సైతం విదేశీ మద్యం అందుబాటులో ఉంచి గోప్యంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. మరికొందరు గోవా, పాండిచ్చేరి నుంచి పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు డిఫెన్స్‌కు సంబంధించిన మద్యం బాటిళ్లను సైతం విక్రయిస్తున్నారు. డిఫెన్స్‌లో 50 శాతం తక్కువకే మద్యం దొరుకుతుంది. దీంతో వాటిని తమకు తెలిసిన వారి ద్వారా కొనుగోలు చేయించి బయట అధిక శాతం ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోది. పెద్ద మొత్తంలో విదేశీ మద్యం సరిహద్దు దాటి జిల్లాకు వస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అధికారుల తనిఖీల ఊసే లేకపోవడంతో జిల్లాలో విచ్చలవిడిగా విదేశీ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇతర జిల్లాలకు సైతం జిల్లా మీదుగానే విదేశీ మద్యం తరలుతుందని రెండురోజుల కిందట తడ చెక్‌పోస్టు వద్ద వాణిజ్య పన్నులశాఖ దాడుల్లో బహిర్గతమైంది. ఇప్పటికైనా ఎక్సైజ్‌శాఖ అధికారులు కళ్తు తెరిచి దాడులు నిర్వహిస్తే పెద్ద ఎత్తున్న విదేశీమద్యం దొరికే అవకాశం ఉంది.