భక్తుల భద్రతకు జాయింట్ యాక్షన్ కమిటీ
విజయవాడ : పుష్కర యాత్రికులకు భద్రత, ఇతర అంశాల నిమిత్తం ఉన్నతాధికారులు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ రోజూ ఆయా అంశాలపై సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ బాబు.ఏ, సీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు నగరంలో ఘాట్లలో జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పాలన, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో సమష్టి నిర్ణయం తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. అధికారుల బృందం సమన్వయంతో పనిచేసి రోజూ రాత్రి 8 గంటల సమయంలో పుష్కర ఏర్పాట్లు, అవసరమైన మార్పులు చేర్పులపై సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పోలీస్, రెవెన్యూ ఇరిగేషన్, ఇతర శాఖల్లో ఎంపిక చేసిన అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రత్యేక అధికారి రాజశేఖర్ సూచించారు. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తూ పోలీసు శాఖ తరఫున ఐపీఎస్ అధికారి విశాల్‌గున్ని, జిల్లా యంత్రాంగంతో సమన్వయం కలిగి ఉంటారని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ అధికారే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. అనంతరం అధికారుల బృందం దుర్గా, పద్మావతి ఘాట్‌లో పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసింది.
అప్రాన్ పనుల పరిశీలన
ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న అఫ్రాన్ వద్ద చేపడుతున్న పనులను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ అప్రాన్‌పై ప్రత్యేకంగా 30 స్టాళ్లు, ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ 4న ప్రారంభం
పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణపై సీఎం స్థాయిలో ప్రత్యక్ష పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఆగస్టు 4 నుంచి పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, డీఐజీ సూర్యప్రకాశరావు, జాయింట్ పోలీస్ కమిషనర్ హరికుమార్, డెప్యూటీ కమిషనర్ అశోక్‌కుమార్, సబ్ కలెక్టర్ డాక్టర్ జి.సృ జన ఇతర అధికారులు పాల్గొన్నారు.