
తాడుకు కోడిని కట్టి... చికెన్ తిన్నట్లుంది!
మహేశ్వరం: కేసీఆర్ పాలన చూస్తుంటే.. ‘తాడుకు కోడిని కట్టి ...చికెన్ తిన్నట్లు ఉంద’ని...పీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ హోం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అప్పులు చేసి...ఆటోలు, కార్లు తీసుకొని జీవిస్తున్న వారి రేషన్ కార్డులు, పింఛన్లు ప్రభుత్వం తొలగించడం దారుణమని అన్నారు. అర్హుల రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించినందుకు నిరసనగా సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ,, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం కుంటిసాకులతో అర్హులకు పథకాలు అందకుండా చేస్తోందన్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీఎం వద్ద నియోజకవర్గ సమస్యలను లెవనేత్తే దమ్ము, ధైర్యం మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదని ఆమె విమర్శించారు. బతుకమ్మల పేరిట రూ.35 వేల కోట్లను సీఎం కుమార్తెకు విడుదల చేశారని ఆరోపించారు. ‘దసరా ముగిశాక విదేశాల్లో కవితమ్మ బతుకమ్మలు ఆడడం ఎంట’ని ఎద్దేవా చేశారు. చెవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ మీర్‌పేట్‌లోని టీకేఆర్ కాలేజ్‌లో ఇరిగేషన్, దేవాదాయ భూములు ఉన్నందుకు వాటిని కూల్చుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించడంతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరారని విమర్శించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కనబడకుండా పోయారని అన్నారు.
అంతకుముందు మహేశ్వరం చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలగించిన రేషన్ కార్డులను వెంటనే పురుద్ధరించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ ఎనుగు జంగారెడ్డి, మహేశ్వరం ఎంపీపీ పెంటమల్ల స్నేహ, పీఎసీఎస్ చైర్మన్ పోతర్ల అంబయ్య యాదవ్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్న, సీనియర్ నాయకులు కె.రఘుమారెడ్డి, కె.నర్సింహరెడ్డి, సుధాకర్‌రెడ్డి, బ్యాగరి సురేష్, ఎం.నవీన్, షేక్ అబుబాకర్, మహేశ్వరం, కందుకూరు పార్టీ మండల అధ్యక్షులు శివమూర్తి, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.