
రైతులందరికీ రుణమాఫీ..ఎక్కడ..?
♦ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డిని నిలదీసిన రైతులు
♦ మంత్రి గంటా సమక్షంలోనే నిరసన
♦ రుణ ఉపశమన పత్రాల పంపిణీ సభలో గందరగోళం
పులివెందుల/రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించలేదంటూ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డిని రైతులు నిలదీశారు. బుధవారం పట్టణంలోని శిల్పారామంలో రెండవ విడత రుణ ఉపశమన పత్రాలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పులివెందుల ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ పరిధిలోని తొండూరు మండలానికి చెందిన గంగనపల్లె, సంతకొవ్వూరు, అగడూరు, పోతులపల్లె, చెర్లోపల్లె గ్రామాలకు చెందిన రైతులు తమకు మొదటి విడత రుణమాఫీ కాలేదంటూ అర్హత పత్రాలు చేత పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. మొదటి విడత రుణమాఫీ కాకుండానే రెండవ విడతకు సంబంధించి పత్రాలు ఇవ్వడం ఏమిటని నిలదీశారు.
రుణమాఫీతోపాటు ఇన్సూరెన్స్ కూడా వర్తించక మేము అనే క అవస్థలు పడుతుంటే.. మీరు మాత్రం రైతులకు మేలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఒక పులివెందుల ఎస్‌బీఐ మె యిన్ బ్రాంచ్‌లోనే దాదాపు 5వేల మందికి రుణమాఫీ వర్తించలేదన్నారు. రుణమాఫీ కోసం పులివెందుల బ్యాంకు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం, ప్రణాళిక చైర్మన్ కుటుంబరావుకు సైతం అన్ని అర్హతపత్రాలు పంపినా రుణమాఫీ కాలేదని వాపోయారు.దీంతో రైతులందరికి రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి.. సతీష్‌రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసంగం మొదలుకాగానే మహిళలు భారీగా వెళ్లిపోవడం ప్రారంభించారు.
రైతుల అభ్యున్నతే సీఎం ధ్యేయం: రైతుల అభ్యున్నతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 36 లక్షల మంది రైతులకు రూ.3,500 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ లింగారెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, జయరాములు, జేసీ-2 శేషయ్య, టీటీడీ మెంబరు పుట్టా సుధాకర్‌యాదవ్, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కడప అంటే భయపడి పరిశ్రమలు రావడంలేదు మంత్రి గంటా శ్రీనివాసరావు
జమ్మలమడుగు: కడప అంటే పరిశ్రమలను స్థాపించటానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, రాష్ట్ర మానవవనరుల మంత్రి గంటాశ్రీనివాసరావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఫైర్‌స్టేషన్ ఎదురుగా ఉన్న తోటలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లా అంటే బయటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్, బాంబులు, కోట్లాటలు అన్న ప్రచారం ఉందన్నారు.
ఆ ఇమేజ్‌ను పూర్తిగా మార్చి బాగా అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆది సోదరులు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అత్యధికంగా వైఎస్సార్‌సీపీకి ఎమ్మెల్యే స్థానాలు కట్టబెట్టిన కడప జిల్లా నుంచే బలమైన ఎమ్మెల్యేలు కావాలని ఆహ్వానించామన్నారు. రెండు గ్రూపులతో మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికోసం పార్టీలో చేర్చుకున్నామని, ఇప్పటికి 20 మంది ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. త్వరలో ఇంకా నంబర్ పెరుగుతుందన్నారు.
ఎమ్మెల్యేకు చుక్కెదురు
వైయస్ .జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి వయసు కలిగిన చంద్రబాబును చెప్పులతో కొట్టండి అని చెప్పారని, పెద్దలంటే గౌరవం లేని అతడినే ప్రజలు రెండు చెప్పులతో కొట్టాలని ఎమ్మెల్యే ఆది అనడంతో సభలో వెనుక కూర్చున్న కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఓడిపోయే కాలం దాపురించింది కాబట్టే ఇలా మాట్లాడుతున్నాడని కార్యకర్తలు బహిరంగంగా అనటంతో పక్కన ఉన్నవారు వారిని వారించారు. పెద్దపసుపలకు చెందిన ఓ కార్యకర్త వెనుకవైపు నుంచి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతనిని సభలో నుంచి బయటికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను నాలుగువేల పెన్షన్లు మంజూరుచేయిస్తే కొంతమంది తాము తెచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా మాజీ మంత్రి పీఆర్‌కు సూచించారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం ఖరీదైనది. అయితే ప్రజలే పేదలు అన్నారు. వైఎస్‌ఆర్ హయంలో కొంత అభివృద్ధి జరిగిందన్నారు. ఇంకా జరగాల్సి ఉందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జయరాములు రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు, మున్సిపల్ చైర్మన్ తులసి, ముసలయ్య, ఎంపీపీ అరుణ, తదితరులు పాల్గొన్నారు.