
తాగునీరిస్తారా చావమంటారా
♦ పురుగుమందు డబ్బాలతో కేసానుపల్లి వాసుల నిరసన
♦ పురుగు మందు డబ్బాతో గ్రామస్తుల నిరసన
♦ తంగెడ మేజర్ కాలువ నుంచి నీరందించాలని డిమాండ్
దాచేపల్లి : తమ గ్రామాలకు తక్షణం తాగునీరు విడుదల చేయకుంటే తాము ఆత్మహత్య చేసుకుంటామని కేసానుపల్లి గ్రామ ప్రజలు అధికారులను హెచ్చరించారు. తంగెడ మేజర్ కాలువ నుంచి కేసానుపల్లి కాలువకు నీటిని మళ్లించేందుకు గ్రామస్తులు గురువారం వెళ్లారు. విషయం తెలుసుకున్న జలవనరుల శాఖ ఏఈ పసుపులేటి ఆదినారాయణ తన సిబ్బందితో కలిసి కాలువ వద్దకు వెళ్లి గ్రామస్తులను అడ్డుకున్నారు. నీటిని తరలించేందుకు కాలువలో వేసిన మట్టిని అధికారులు పొక్లెయిన్‌తో తొలగించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేసానుపల్లి కాలువకు నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని వెంట తెచ్చుకున్న పురుగు మందు డబ్బాలను అధికారులకు చూపించారు. వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రామంలోని మంచినీటి బోర్లు పనిచేయడంలేదని తెలి పారు.
నీటికోసం రేయింబవళ్లు పడిగాపులు పడుతున్నాం
నీటి కోసం రేయింబవళ్లు బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నామని, నీరు దొరక్క ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు వివరించారు. గ్రామంలో ఉన్న బావుల్లో నీటిని నింపితే భూగర్భజలాలు పెరిగి బోర్లు పనిచేస్తాయని, తాగునీటికి ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు నెల్లూరి శ్రీనివాసరావు, కర్నాటి నాగేశ్వరరావు, జక్కుల వీరాస్వామి, నెల్లూరి బ్రహ్మయ్య, అలవల ప్రసాద్, గొంది చందు, యడ్లపల్లి లక్ష్మీనారాయణ చెప్పారు. బావులు నింపడానికి అనుమతులు లేవని, ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తామని ఏఈ ఆదినారాయణ గ్రామస్తులకు తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.