- వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత
పికప్ చేసుకునేందుకు వెళ్లి...
గుత్తి రూరల్ : కొత్తపేట గ్రామ శివార్లలో కాశిరెడ్డి నాయన ఆలయం వద్ద 67వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి తూఫాన్ జీపు పల్సర్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం క్రిష్టపాడుకు చెందిన బాబా పకృద్ధీన్ అతని మేనమామ అనంతపురానికి చెందిన ఖాదర్‌బాషా కర్నూలు నుంచి గుత్తికి వచ్చాడు. బస్టాండ్ నుంచి అతడిని గ్రామానికి తీసుకువచ్చేందుకు తన స్నేహితుడైన షేక్ బాషాను తీసుకొని పల్సర్ బైక్‌లో గుత్తికి బయలుదేరాడు. కొత్తపేట గ్రామ శివార్లలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న బైక్‌ను తాడిపత్రి వైపునకు వెళ్తున్న తూపాన్ జీపు ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ పైకి ఎగిసి పడి అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను తూపాన్ జీపు ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. కాస్త ముందుకెళ్లిన తర్వాత తూఫాన్ వాహనం టైరు పంక్చర్ కావడంతో అందులో ఉన్న వారు కిందకు దిగి పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని గుత్తి ఎస్‌ఐ రామాంజనేయులు సందర్శించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు షేక్ బాషాకు భార్య నసీమా, కుమార్తె ఉండగా బాబా పకృద్ధీన్ అవివాహితుడు.
కోడలిని పిలుచుకొచ్చేందుకు వెళ్లి మామ..
మడకశిర రూరల్ : ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెలితే.. కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకా కదిరేపల్లికి చెందిన శివన్న (52), భార్య జయమ్మ, కుమారుడు ప్రకాష్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుడిబండ మండలం కల్లురొప్పం గ్రామం నుంచి కోడలు రూప, ఆమె కుమారుడు ప్రీతమ్‌ను స్వగ్రామానికి పిలుచుకుపోవడానికి వచ్చారు. గురువారం వీరితోపాటు రాళ్లపల్లికి చెందిన లక్ష్మమ్మ, మైనగానపల్లికి చెందిన పార్వతమ్మ మడకశిరకు ఆటోలో బయల్దేరారు. గుర్రపుకొండ క్రాస్ వద్ద ప్రధాన రోడ్డుపై ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలోని వారందరితోపాటు డ్రైవర్ రంగనాథ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సతీష్‌కుమార్ చికిత్స చేశారు. శివన్న చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని మరొకరు
సోమందేపల్లి(గోరంట్ల) : గోరంట్ల మండలం పాలసముద్రం జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం గుర్తు తెలియని కారు ఢీకొని చిలమత్తురు మండలం బందేపల్లికు చెందిన సుబ్బిరెడ్డి(56) మృతి చెందాడు. భార్య ఈశ్వరమ్మతో కలిసి ద్విచక్రవాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఈశ్వరమ్మ స్వల్ప గాయాలతో బయటపడింది. సుబ్బిరెడ్డి మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.