పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
Published Fri, Aug 19 2016 6:45 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి భర్త నుంచి తనను దూరం చేయడమే కాకుండా.. సహజీవనం చేసి కొడుకును కూడా కన్న తర్వాత పెళ్లికి ముఖం చాటేస్తున్న యువకుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. భగత్‌సింగ్ కాలనీకి చెందిన ఎస్.పీ.అశోక్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సుజాత (27) అనే యువతిని ప్రేమించాడు. సుజాతకు 2014లో సురేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే పాతపరిచయాన్ని పెంచుకున్న అశోక్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కట్టుకున్న భర్తకు దూరం చేసి నవనిర్మాణనగర్‌లో కాపురం పెట్టాడు. కొన్ని రోజులు ప్రేమగా చూసుకున్న అనంతరం ఆమె వద్దకు రావడం మానేశాడు. ఇదేంటని నిలదీస్తే ముఖం చాటేశాడు. దాంతో ఆమె తొమ్మిది నెలల గర్భంతో ఉన్నప్పుడే గత యేడాది జూన్ 29న అశోక్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతుంది. ఈ నేపధ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ శుక్రవారం భవానినగర్‌లోని అశోక్ ఇంటి ముందు బైఠాయించింది.
Advertisement
Advertisement