మాట్లాడుతున్న ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి
– ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి డిమాండ్
తిరుపతి కల్చరల్: కళాకారుల నిరసన దీక్షల సందర్భంగా టీటీడీ అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే యండపల్లి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సమస్యలపై జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగిచారు. తమ సమస్యలు పరిష్కరించాలని కళాకారులు టీటీడీ పరిపాలనా భవనం వద్ద సామూహిక నిరసన దీక్షలు చేపట్టారన్నారు. కళాకారుల దీక్షలపై టీటీడీ అధికారులు స్పందించి 14 సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారులు హామీ ఇచ్చి 9 నెలలు గడుస్తున్నా అమలు కాకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల యూనియన్ నాయకులు చంద్రశేఖర్, గంగులప్ప, జి.నాగేంద్రప్రసాద్, ఎల్.రంజిత్, ఎం.రెడ్డెప్ప, జి.చౌడప్ప, కళాకారులు పాల్గొన్నారు.