రాజంపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు తగ్గట్లు నిధులను కేటాయించక పోవడంతో మండలంలో ఒకటి, రెండు పాఠశాలలు మినహా ఏ పాఠశాలలో కూడా వంట ఏజెన్సీ నిర్వాహకులు వారానికి విద్యార్థులకు మూడు కోడిగుడ్లు పెట్టడం లేదు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం అరకొరగా నిధులు కేటాయించడం, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అమాంతంగా పెరగడం, దీనికి తోడు నెల, నెల బిల్లులను చెల్లించక పోవడం వల్ల వంట ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు వారానికి మూడు కోడి గుడ్లు పెట్టేందుకు గుడ్లు తేలేస్తున్నారు. రాజంపేట మండలంలో 95 ప్రాథమిక పాఠశాలలు, 7 ప్రాథమికోన్నత పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం తప్ప అందుకు తగ్గ చర్యలు తీసుకోక పోవడంతో నిర్వాహకులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తలకు మించిన భారమవుతోంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో చదివే ఒక్కొక్క విద్యార్థికి రూ.5.18, ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థికి రూ.7.36ను ప్రభుత్వం కేటాయిçస్తుంది. విద్యార్థులకు వారానికి మూడు కోడి గుడ్లు పెట్టాలంటే ఒక్కొ విద్యార్థికి కనీసం 12 రూపాయలు చెల్లిస్తే తప్ప గిట్టుబాటు కాదని వంట ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. ఇదిలావుంటే ఒక్కో విద్యార్థికి రూ.8.25 కేటాయిస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ కూడా ఇప్పటికి నెరవేరలేదని వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగదు పెంచక పోవడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు కూడా చేసేదేమి లేక పాత పద్ధతిలోనే వారానికి కేవలం రెండు కోడిగుడ్లను మాత్రమే విద్యార్థులకు పెడుతున్నారు.
అమలుకు నోచుకోని గౌరవ వేతన పెంపు జీఓ
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వంట చేసిపెట్టేందుకు ఒక్కో వంట మనిషికి గౌరవ వేతనంగా నెలకు వెయ్యి రూపాయిలు ఇస్తున్నారు. అయితే వీరి గౌరవ వేతనాన్ని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెయ్యి రూపాయిల నుంచి 1500కు పెంచుతున్నట్లు జీఓ విడుదల చేశారు. అయితే అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాల వల్ల గౌరవ వేతన పెంపు జీఓకు ఆర్థికశాఖ ఆమోద ముద్రపడక పోవడంతో వంట మనుషుల గౌరవవేతనం పెంపు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. ఇదిలావుంటే 25 మంది విద్యార్థులకు ఒక వంట మనిషి. 25 నుంచి 50 మంది విద్యార్థుల వరకు ఇద్దరు, 50 నుంచి 100 మంది విద్యార్థులకు ముగ్గురు, 100 మందికి పైబడి విద్యార్థులుంటే నలుగురు వంట మనుషులు మధ్యాహ్న భోజనాన్ని చేస్తారు. వీరు ఉదయం నుంచి మధ్యాçహ్నం వరకు పనిచేసినా నెలకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తుండటంతో అనేక ప్రాంతాల్లో వంట ఏజెన్సీలకు వంట మనుషులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కోడిగుడ్లకు నిధులు లేవు
Published Wed, Dec 28 2016 5:49 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
Advertisement