ఆయకట్టు రైతుల కష్టాలు పట్టవా..?
- ప్రభుత్వం ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి
గార్లదిన్నె : గాలిలో లెక్కలు చెబుతున్న టీడీపీ ప్రభుత్వం, ఈ రెండేళ్ల కాలంలో అనంత ఆయకట్టు రైతన్నకు ఏ మేరకు సాగునీరు ఇచ్చిందో చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్ల కాలంలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేక పోయారన్నారు. అందువల్లే గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా, ఈ కాలనీకి వెళ్లిన జనమంతా సమస్యలు ఏకరువు పెడుతున్నారన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం గార్లదిన్నె తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గం సమన్వయ కర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో ధర్నా వైఎస్సార్ సీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ధర్నాలో పాల్గొన్న అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, తాను అధికారంలో ఉన్న సమయంలో జిల్లాకు వచ్చిన 26 టీఎంసీల నీటితోనే దాదాపు 1.50 లక్షలు ఎకరాల ఆయకట్టు భూములకు, తాగు నీటి అవసరాలకు సరఫరా చేయడంతో పాటు, వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు నీరు అందించామన్నారు.
ఇపుడు 18.50 టీఎంసీల హెచ్చెల్సీ నీటితో పాటు 12 టీఎంసీల నీటిని హంద్రీనీవా ద్వారా తెచ్చామని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నా, ఆయకట్టు భూములకు సాగునీటిని కాదుకదా..కనీసం తాగునీటి అవసరాలకు కూడా నీరు అందించలేకపోయారన్నారు. అనంత రైతన్నల సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కనీసం ఈ సంవత్సరమైన ఆయకట్టుకు తగినంత నీరందించి ఆదుకోవాలని కోరారు.