గార్లదిన్నెలో బహిరంగ సభ జరుపుతాం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత
శింగనమల : వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు’ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా గార్లదిన్నెలో బహిరంగసభ జరిపి తీరుతామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ‘మేలు కొలుపు’ యాత్రలో భాగంగా గార్లదిన్నె మండలం కల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలో 4 లక్షల మంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారన్నారు. జిల్లాలో 267 మంది రైతులు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
సాగు, తాగు నీరు అందడం లేదని, పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందని పాదయాత్ర ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని జొన్నలగడ్డ పద్మావతి ‘మేలుకొలుపు’ కార్యక్రమ చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వ విప్ ప్రభుత్వ పెద్దలతో చర్చించి పోలీసుల ద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ధర్మవరంలో ప్లెక్సీల కోసం మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కొట్టుకుంటే పోలీసులు దగ్గర ఉండి బహిరంగ సభ జరిపించలేదా..? అనంతపురం ఎమ్మెల్యే, ఎంపీ ఘర్షణ పడితే ప్రత్యేకంగా వారికి సభలు పెట్టించలేదా..?
నవనిర్మాణ దీక్షల పేరుతో అనంతపురంలోని టావర్‌క్లాక్ వద్ద ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా సభలు పెట్టించారన్నారు. పోలీసులు ప్రజాసామ్యబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ‘మేలుకొలుపు’ పాదయాత్రను అడ్డుకుంటే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర చేపడుతామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, సీనియర్ నాయకులు అమరేంద్రనాథ్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, ఎంపీటీసీ సభ్యులు జగ్గాల రవి, వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.