వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వహించనున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై మా ట్లాడామని తెలిపారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వైఎస్సార్‌సీపీ ఉద్యమాలు, పోరాటాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే జూలై 8వ తేదీ నుంచి గడప గడపకూ వైఎస్సార్‌సీపీ పేరుతో పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేయనున్నామని తెలి పారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు వివరిస్తామన్నారు.
ముద్రగడ కుటుంబంపై ప్రభుత్వం, పోలీసులు దారుణంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దమననీతిని సాక్షి కళ్లకు కట్టినట్లు చూపిస్తుందనే భయంతో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారని విమర్శించారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలాంటి నీచరాజకీయాలకు పాల్పడడం శోచనీయమని, బాబుకు రాజకీయ సమాధి తప్పదని చెప్పారు. జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న తనకు పాతపట్నం ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారని, ఇందుకు జగన్‌మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పాతపట్నంలో పార్టీ బలోపేతానికి తన వంతుగా పూర్తిగా కృషిచేస్తానన్నారు.