భారీగానే దోచేశారు..
ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంకులో చోరీ బంగారం 4.6 కిలోలు
ఘట్‌కేసర్ : బ్యాంకులో దుండగులు భారీగానే చోరీ చేశారు. ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంకులో సోమవారం వెలుగుచూసిన ఘటనలో దొంగలు మొత్తం 4.6 కిలోల బంగారం అపహరించుకుపోయారని అధికారులు తేల్చారు. దుండగుల కోసం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు లాకర్లు కోయడానికి ఉపయోగించిన కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రొఫెషనల్స్ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. బ్యాంకులోని మూడో లాకర్‌లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని అధికారులు దాచి ఉంచారు. మొత్తం 82 మంది ఖాతాదారులు రుణాలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. సంబంధిత ఖాతాదారులకు నోటీసులను అందజేస్తున్నట్లు తెలిపారు.
చోరీ జరిగిన బంగారానికి ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఖాతాదారులకు చెల్లిస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. తీసుకున్న రుణం.. వడ్డీని మినహాయించి మిగిలిన మొత్తం అందజేస్తామని వివరించారు. అయితే, ఇలాంటి చోరీలు గతంలో వరంగల్, విజయవాడ ప్రాంతాల్లో జరగడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. చోరీ జరిగిన విషయం తెలియడంతో కస్టమర్లు మంగళవారం చాలామంది బ్యాంకుకు వచ్చి తమ లాకర్లు క్షేమంగా ఉండడం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. తాకట్టు పెట్టిన బంగారం మాత్రమే చోరీకి గురైందని అధికారులు వారికి తెలియజేశారు.