బల్మూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా): ప్రేమ పేరుతో ఓ యువకుడు ఫోన్లో వేధింపులకు పాల్పడి, బెదిరించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని పోలిశెట్టిపల్లిలో చోటుచేసుకుంది. గట్టుతుమ్మెన్‌కు చెందిన లక్ష్మమ్మ, బాలీశ్వరయ్య దంపతులు స్థానికంగా కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కాగా, బాలీశ్వయ్య 12 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి లక్ష్మమ్మ తన కూతురు అంజలి (13) తో కలిసి పుట్టినిల్లు పోలిశెట్టిపల్లికి వచ్చింది. కూలి పనులు చేస్తూ ప్రస్తుతం కూతురును అచ్చంపేటలోని శారద విద్యాలయంలో ఎనిమిదోతరగతి చదివిస్తోంది. ఎప్పటిలాగే మంగళవారం పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన బాలిక సాయంత్రం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
ఫోన్లో వేధింపులు..
అంజలిని కొన్ని నెలలుగా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన బాల్‌రాజు అనే యువకుడు ఫోన్లో వేధించసాగాడు. ప్రేమించాలంటూ వచ్చే బెదిరింపుల కాల్స్ కారణంగానే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తహసీల్దార్ అంజిరెడ్డి, ఏఎస్‌ఐ జిలానీ ఎదుట మరణించే ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, వేధింపులకు గురిచేసిన యువకుడు నాగర్‌కర్నూల్ మండలం నల్లవల్లికి చెందిన తమ సమీప బంధువు ఇంటికి వచ్చి వెళ్లేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై విద్యార్థిని తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బుధవారం సాయంత్రం అచ్చంపేట ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినచర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
యువకుడి వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
Published Wed, Oct 26 2016 8:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
Advertisement
Advertisement