ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి
Published Tue, Apr 18 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM
– జిల్లాస్థాయి కమిటీకి జేసీ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్‌లను జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి ఫీజు బులిటీకి అవకాశం ఉందా లేదా అనే దానిపై వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. సోమవారం రాత్రి తన ఛాంబర్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుంగభద్రలో కౌతాళం మండలం గుడికంబాలిలో మూడు, నదిచాగిలో రెండు, హొళగుంద మండలం ముదటమాగిలో రెండు రీచ్‌లను గుర్తించినట్లు తెలిపారు. దేవనకొండ మండలంలోని హంద్రీ, ఇతర వాగులు, వంకల్లో ఏడు రీచ్‌లు గుర్తించామన్నారు.
వీటిలో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని పరిశీలించాలన్నారు. ఇందుకు ఇరిగేషన్ ఎస్‌ఈ, భూగర్భ జలవనరుల శాఖ డీడీ, మైనింగ్ ఏడీ, సంబంధిత ఆర్‌డీఓలు రీచ్‌లను పరిశీలించి వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హంద్రీ వెంట 36 గ్రామాలు ఉండగా లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక ఉన్న గ్రామాలు 15 ఉన్నాయన్నారు. వీటిలో కూడా ఇసుక తీసేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని అధ్యయనం చేయాలన్నారు. సమావేశంలో మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి, గ్రౌండ్ వాటర్ డీడీ రవీందర్‌రావు, ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, ఆర్‌డీఓలు హుసేన్ సాహెబ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
Advertisement