శోభాయమానం... శ్రీవారి తెప్పోత్సవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం క్షేత్రంలోని భూదేవి, లక్ష్మీసమేతుడైన శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం మంగళవారం వైభవంగా కొనసాగింది. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామి, అమ్మవారు సేద తీరేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దిగువ అహోబిలం దేవస్థాన పరిధిలో ఉన్న కోనేటిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ ప్రహ్లాదవరదస్వామి తెప్పను అధిరోహించి మూడు మార్లు ప్రదక్షణ చేశారు. అంతకు ముందు ఆలయం నుంచి ఉత్సవమూర్తులైన స్వామి, అమ్మవార్లను ప్రత్యేక పల్లకీపై మాడ వీధుల్లో ఊరేగింపుగా కోనేటి వరకు తీసుకొచా్చరు. స్వామి, అమ్మవారు తెప్పను అధిరోహించి పీఠాధిపతి శ్రీరంగనా«థ యతీంత్ర మహాదేశికన్, ఆలయ అర్చకులు, వేదపండితుల పూజలు అందుకున్నారు. సుమారు గంటపాటు తెప్పోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో కోనేరు వద్దకు చేరుకుని ఈ ఉత్సవాన్ని తిలకించారు.