కోర్టుకు లాగారు!
డ్వాక్రా మహిళలకు సర్కార్ మోసం
రుణమాఫీ పేరుతో దగా చేసిన చంద్రబాబు
అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తిసిన వైనం
మాఫీ అవుతుందనుకున్న మహిళలకు నిరాశ
తేరుకునే లోపు కోర్టు నుంచి నోటీసులు
గౌరవంగా బతుకుతున్న తమను బజారుకీడుస్తారా?
‘జీవనోపాధుల కోసం తీసుకున్న రుణాలను ఏ ఒక్కరూ చెల్లించకండి. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మీ రుణాలన్నీ మాఫీ చేస్తాను’ అంటూ ఎన్నికలకు ముందు మహిళా సంఘాలకు చంద్రబాబు ఇచ్చిన హామీలో డొల్లతనం బయటపడింది. అప్పటి వరకూ రుణాలు సక్రమంగా చెల్లిస్తూ వచ్చిన మహిళా సంఘాలు సైతం చంద్రబాబు హామీతో చెల్లింపులపై మిన్నకుండి పోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై పూటకోమాట మాట్లాడుతూ వచ్చిన సర్కార్... చివరకు మహిళలను కోర్టుకు లాగింది. తీసుకున్న రుణాలను నయాపైసాతో సహా చెల్లించాలంటూ కోర్టు ద్వారా పంపిన బ్యాంకర్లు నోటీసులతో మహిళలు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇంత కాలం గుట్టుచప్పుడు కాకుండా సంసారం నెట్టుకు వస్తున్న తమను బజారు కీడ్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఉరవకొండ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన మహిళా సంఘాలు.. చంద్రబాబు రుణమాఫీ మాయాజాలంలో చిక్కుకుని బ్యాంక్‌లలో డీఫాల్డ్ గ్రూపులుగా మారాయి. 2012 నుంచి 2014 వరకూ ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 4,567 మహిళా సంఘాల్లోని 46,107 మంది సభ్యులకు జీవనోపాధుల కోసం ప్రభుత్వాలు రుణాలు మంజూరు చేశాయి. వీటి కంతులను సకాలంలో ఆయా మహిళా సంఘాలు చెల్లిస్తూ వచ్చాయి. సంఘానికి రూ. 10 వేల ప్రకారం రెండు విడతలుగా రూ. 30.18 కోట్ల పెట్టుబడి నిధిని బ్యాంకర్లు మంజూరు చేయగా... వీటిలో అత్యధిక శాతాన్ని మహిళా సంఘాలు చెల్లించాయి. ప్రస్తుతం బ్యాంక్‌లకు మహిళా సంఘాలు రూ. 14.90 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా రుణమాఫీ ప్రకటనతో నిలిచిపోయిన సొమ్ము కావడం గమనార్హం. అధికారం దక్కించుకోవడంలో భాగంగా మహిళా సంఘాలను మభ్యపెట్టి కంతులు చెల్లించకుండా అప్పట్లో చంద్రబాబు నిలువరించి ఉండకపోయి ఉంటే ఈ బకాయి కూడా ఉండేది కాదని పలువురు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.
తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందే
తీసుకున్న రుణాలను చెల్లించాలంటూ కోర్టు ద్వారా వందలాది మహిళా సంఘాలకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలకు చెందిన 670 మహిళా సంఘాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ల నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మహిళా సంఘాల సభ్యుల్లో గగ్గోలు మొదలైంది. ఏనాడూ కోర్టు మెట్టు ఎక్కని మహిళలు... న్యాయస్థానంపై గౌరవంతో రెండ్రోజుల క్రితం కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్మి తాము మోసపోయామంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. వడ్డీతో రుణాలు చెల్లించలేమని, అసలు మాత్రమే చెల్లిస్తామని, ఇందుకు నెల రోజుల గడవు తీసుకుని వచ్చారు. రుణమాఫీ అయివుంటే తమకు ఆర్థికంగా కొంత ఉపశమనం దొరికేదని, అయితే ముఖ్యమంత్రి తమను ఇలా దగా చేస్తారని ఊహించలేదంటూ ఈ సందర్భంగా పలువురు మహిళలు వాపోయారు.
అవమానపరిచారు
రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు కోర్టు ద్వారా నోటీసులు పంపి మమ్మల్ని అవమానపరిచారు. సంఘంలో మొత్తం 10 మంది రోజూ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాం. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో ఒక్కసారిగా వడ్డీ భారం పెరిగిపోయింది. దీంతో రుణం చెల్లించలేని దుస్థితి నెలకొంది.
- ముత్యాలమ్మ,, షెక్షానుపల్లి
సీఎం సమాధానం చెప్పాలి
రుణమాఫీ చేస్తానంటూ హమీ ఇచ్చిన సీఎం సార్ సమాధానం చెప్పాలి. ఆయన చెప్పిన మాట విని మేము డబ్బు కట్టలేదు. అయినా రుణాలు మాఫీ చేయడం చేతకానప్పుడు ఎందుకు హమీ ఇవ్వాలి? మమ్మల్ని బజారుకీడ్చడానికా?
- రామాంజినమ్మ, షెక్షానుపల్లి