ప్రజాధనం దోపిడీ? | Government funds misused | Sakshi
Sakshi News home page

ప్రజాధనం దోపిడీ?

Published Wed, Aug 17 2016 1:17 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

ప్రజాధనం దోపిడీ? - Sakshi

ప్రజాధనం దోపిడీ?

 
  • బోగోలులో భారీ కుంభకోణం
  •  స.హ.చట్టం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన వైఎస్సార్సీపీ
 
బిట్రగుంట: బోగోలు మేజర్‌ పంచాయతీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అధికారులు, పంచాయతీ పాలకులు కలిసి రూ.25 లక్షల ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఒకేపనికి రెండు సార్లు బిల్లులు చేసుకోవడం, కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఒకే పనిని మూడు పనులుగా విభజించడంతో పాటు దాతలు దాతృత్వంతో చేసిన పనులకు కూడా బిల్లులు చేసుకోవడం గమనార్హం. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెలుగులోకి తీసుకురావడంతో పంచాయతీ పాలకుల్లో గుబులు మొదలైంది. బోగోలు మేజర్‌ పంచాయతీ నిర్వహణపై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండటం, ఉప సర్పంచ్‌ అంజయ్యయాదవ్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ మద్దిబోయిన వీరరఘు సమాచార హక్కు చట్టం ద్వారా పంచాయతీ ఆదాయ వ్యయాలపై వివరాల కోసం దరఖాస్తు చేశారు. జూన్‌ రెండున దరఖాస్తు చేయగా, ఆగస్ట్‌ పదో తేదీన అధికారులు సమాచారాన్ని అసంపూర్తిగా, అయిష్టంగా అందించారు. వివరాలను పరిశీలిస్తే విస్తుగొలిపే వాస్తవాలు కనిపిస్తున్నాయి. 
ఇదీ తీరు..
మూడేళ్ల కాలంలో పంచాయతీకి సుమారు రూ.1.5 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. వీటిలో పంచాయతీ సాధారణ నిధులు రూ.65.93 లక్షలు, 13వ ఆర్థిక సంఘ నిధులు రూ.52.74 లక్షలు, 14వ ఆర్థిక సంఘ నిధులు రూ.27.5 లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘ నిధులు రూ.నాలుగు లక్షల మేర వచ్చాయి. పంచాయతీ అభివృద్ధికి వినియోగించాల్సిన ఈ నిధులను పాలకులు పూర్తిగా దుర్వినియోగం చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి అవసరం లేని చోట, అనవసరమైన పనులతో నిధులను పక్కదారి పట్టించారు. జిమ్మిక్కులతో రూ.25 లక్షల మేర గోల్‌మాల్‌ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్నీ అవకతవకలే..
  • బోగోలు మేజర్‌ పంచాయతీలో నిధుల వినియోగంలో నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. ఉదాహరణకు బోగోలు అరుంధతీయవాడ నుంచి మండల కార్యాలయాలకు వెళ్లే రోడ్డుకు రూ.85 వేలను ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. 
  • అదే ప్రాంతానికి చెందిన దేవపల్లి చినకొండయ్య ఇంటి నుంచి రోడ్డుకు రూ.90 వేలతో మరమ్మతులు చేసినట్లు నిధులను డ్రా చేశారు. 
  • గ్రామ పంచాయతీ కార్యాలయ సిమెంట్‌ రోడ్డు పేరుతో రూ.రెండు లక్షలను డ్రా చేశారు. ఈ రోడ్డు ఎక్కడుండో ఎవరికీ అర్థం కావడం లేదు. 
  • బృందావనం వీధిలో 140 మీటర్ల సీసీ రోడ్డను మూడు పనులుగా విభజించి రూ.ఆరు లక్షలను డ్రా చేశారు. సాధారణంగా రూ.లక్షతో 35 మీటర్ల సీసీ రోడ్డు వేస్తారు. ఈ లెక్కన రూ.4 లక్షలతో పూర్తయ్యే పనికి కమీషన్ల కోసం కక్కుర్తిపడి రూ.ఆరు లక్షలను వెచ్చించారు. 
  • అదే ప్రాంతంలో 250 మీటర్ల సైడ్‌ డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ.4.5 లక్షలను డ్రా చేశారు. ఈ ఒక్క పనిలోనే రూ.రెండు లక్షల మేర దోచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోగోలు దళితవాడలోనూ డ్రెయిన్ల పేరుతో రూ.మూడు లక్షలను వెచ్చించారు. నాసిరకంగా నిర్మించడంతో ఇవి నిరుపయోగంగా మారాయి. 
  • బోగోలు మార్కెట్‌ వీధిలో సీసీ రోడ్ల లెవలింగ్‌కు రూ.1.5 లక్షలను డ్రా చేశారు. సీసీ రోడ్డు లెవలింగ్‌ ఏమిటో స్థానికులకు అర్థం కావడం లేదు. బిల్లులు చేసిన ఇంజినీరింగ్‌ అధికారులకు ఎలా అర్థమైందో అవాక్కవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement