పనిభారం
• ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది కొరత
• సక్రమంగా అందని వైద్య సేవలు
• 500 పడకలకు పెంచితే అదనపు సిబ్బంది అవసరం
• ప్రతిపాదనలు పంపినా పట్టించుకోని ప్రభుత్వం
రెండు, మూడు నెలల్లో ట్రామా కేర్, ఎంసీహెచ్ భవనాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆస్పత్రి 500 పడకలస్థాయికి పెరుగుతుంది. అదనంగా 200 మంది సిబ్బంది అవసరమవుతారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న 41 పోస్టుల్లో స్పెషలిస్ట్ సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, అనలిస్ట్, రేడియాలజిస్ట్, హెడ్‌నర్స్, స్టాఫ్‌నర్స్, ఏఎన్‌ఎం పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వార్డుబాయ్, స్ట్రెచ్చర్ బేరర్లను నియమించాల్సి ఉంది. – ఖమ్మం వైద్య విభాగం
ఖమ్మం, వైద్య విభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు 500 పడకల నిర్మాణానికి పూనుకుంది. కానీ సిబ్బంది కొరతతో రోగులకు వైద్య సేవలకు అందటం లేదు. 15 ఏళ్ల క్రితం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని 250 పడకల స్థాయికి తెచ్చారు. అప్పుటి జనాభా ప్రకారం వైద్య సేవలు సక్రమంగానే అందేవి. జిల్లా జనాభా పెరగటంతో సరిహద్దు జిల్లాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. దీంతో ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ సేవలు పెరిగాయి. ప్రస్తుతం రోజూ 1000 నుంచి 1200 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో ఆస్పత్రిలోని వివిధ విభాగాల సిబ్బందికి పనిభారం పెరిగింది. ఉన్న పడకలకు అదనంగా మరో 100మంది ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. పడకలు పెరుగుతున్నా సిబ్బంది మాత్రం పెరగటం లేదు. ఈ క్రమంలో అందరికీ పూర్తి స్థాయిలో వైద్యం అందించలేక పోవటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో వేరే గత్యంతరం లేక డాక్టర్లు హైదరాబాద్, ఇతర పట్టణాలకు వెళ్లాలని రిఫర్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
202 మంది సిబ్బందితోనే ఆస్పత్రి నిర్వహణ
రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఆస్పత్రికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్, వరంగల్ తర్వాత అత్యధికంగా రోగుల తాకిడి ఇక్కడే ఉంటోంది. అయినా ఈ ఆస్పత్రిని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. అన్ని రకాల వైద్యానికి ఇక్కడ అవకాశమున్నా తగిన సిబ్బంది మాత్రం లేరు. కేవలం 202 మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. 143 మంది పర్మినెంట్, 59 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 250 పడకల స్థాయిలో గతంలో 243 మంది సిబ్బంది ఉండేవారు. పలువురు ఉద్యోగ విరమణ పొందటంతో ప్రస్తుతం 41 ఖాళీలు ఏర్పడ్డాయి. అందులో స్పెషలిస్ట్ సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, అనలిస్ట్, రేడియాలజిస్ట్, హెడ్‌నర్స్, స్టాఫ్‌నర్స్, ఏఎన్‌ఎం పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కింది స్థాయి పోస్టులైన వార్డుబాయ్, స్ట్రెచ్చర్ బేరర్స్, జేఎస్‌డబ్ల్యూ అవసరం చాలా ఉంది.
పడకలు పెరిగితే సిబ్బందిపై మరింత భారం
ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న భవనాలు అందుబాటులోకి వస్తే సిబ్బందిపై మరింత భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 250 బెడ్లతో పాటు మరో 270 అందుబాటులోకి వస్తాయి. ట్రామా కేర్, ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉన్నాయి. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని టీఎస్ ఎంఎస్‌ఐడీసీ అధికారులు చెబుతున్నారు. ఆ భవనాలు పూర్తయితే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సామర్థ్యం 520 పడకలకు చేరుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే వాటికి సరిపడా సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదనపు సిబ్బంది కోసం అధికారులు పలుమార్లు నివేదిక పంపారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటికే వైద్య సేవలు అందించటం చాలా కష్టంగా ఉందని, ఆస్పత్రి స్థాయిని రెట్టింపు చేస్తే వైద్య సేవలు అందించటం కష్టమవుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సిబ్బందిని నియమించిన తర్వాతనే నూతన పడకలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.