ప్రభుత్వ భూములు పరిరక్షించాలి
నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వ భూములు పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్ ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు. గురువారం ప్రకాశం జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శిక్షణ కేంద్రంలో ట్రైనీ ఐఏఎస్‌లకు ప్రభుత్వ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా గ్రామ స్థాయి నుంచి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంకింగ్ చేయడం ద్వారా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవచ్చునని వివరించారు. ప్రభుత్వ భూములను అక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు.