రైతుల భూములపై ప్రభుత్వ కన్ను
-
త్వరలో 211 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం..
-
గన్నవరం పోర్టు – మచిలీపట్నం పోర్టు మధ్య నాలుగు లైన్ల రహదారి
-
పామర్రు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
-
మళ్లీ రైతుల గుండెల్లో గుబులు
సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ లక్షల విలువైన భూముల్ని ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నించడంపై మచిలీపట్నం ప్రాంత రైతాంగం ఆందోళన చెందుతోంది. పామర్రు మండలం నెమ్మలూరులో రూ.300 కోట్లతో నిర్మించే ‘చీకట్లో కనిపించే పరికరాల తయారీ’ కర్మాగారానికి’ సోమవారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగం రైతుల గుండెల్లో గుబులు పుట్టించింది. మచిలీపట్నం పోర్టుకు 33వేల ఎకరాల భూమి తీసుకోవాలనే ప్రభుత్వ ఆలోచనపై ఇప్పటికే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మచిలీపట్నంకు చెందిన వెంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 50 ఎకరాల భూమిని బెల్ కంపెనీకి ఇచ్చారు. తాజాగా రూ.22వేల కోట్లతో 211 కి.మీ పొడవైన ఔటర్ రింగ్‌రోడ్డు నిరిస్తామని చెబుతున్నారు. దీంతో పాటు గన్నవరం ఎయిర్‌పోర్టు, మచిలీపట్నం పోర్టు మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తామని ప్రకటించారు. వీటికోసం ఇంకా ఎంత భూమి సేకరిస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం పోర్టుకు రైతులు భూములు ఇస్తే పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. పరిశ్రమలకు భూములు ఇస్తేనే అభివద్ధి సాధ్యమంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు చెప్పడాన్ని రైతాంగం జీర్ణించుకోలేకపోతోంది.
పరిశ్రమలతో పాటు వ్యవసాయానికి..
ఈ సమావేశంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయమంత్రి జి.సుజనాచౌదరి మాట్లాడుతూ గతంలో పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని, ఇప్పుడు చంద్రబాబు 24 గంటలు ఇస్తున్నారని ప్రకటించారు. వ్యవసాయానికి కనీసం 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని, కాలువ చివరి భూములకూ నీరు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందని పలువురు రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
కొనకళ్ల వకల్తా
బెల్ కంపెనీ నైట్‌విజన్ గ్లాసెస్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయడంపై మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ హర్షం వ్యక్తం చేస్తూ మచిలీపట్నం పోర్టు ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. బెల్, పోర్టు వంటి పరిశ్రమల వల్ల ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఒకవైపు పోర్టు భూములపై రైతులు పోరాడుతుంటే.. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని ఎంపీ కొనకళ్ల చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మెప్పుకోసమే ఇలా చెప్పారని భావిస్తున్నారు. పరిశ్రమలు రావడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతాంగానికి ఎంతో విలువైన భూముల్ని తీసుకోవడం సరైన పద్ధతి కాదని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
పోలీసుల అదుపులో వైఎస్సార్ సీపీ నేతలు
నెమ్మలూరులో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు స్థానిక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో పాటు తోట్లవల్లూరు ఎంపీపీ కల్లం వెంకటేశ్వరరెడ్డి, కొండిపర్రు ఎంపీటీడీ బీవీ రాఘవులు తదితర ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు వచ్చారు. ఉప్పులేటి కల్పనను మాత్రం వేదిక మీదకు అనుమతించారు. మిగతా వారిని పోలీసులు అడ్డుకుని పామర్రు పోలీస్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వదలిపెట్టారు.