జిల్లాలో కార్మికులందరికీ ఉపయోగపడేలా ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలని ఏపీ ఎన్‌జీవో సంఘ రాష్ట్ర నేత చౌదరి పురుషోత్తమనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం: జిల్లాలో కార్మికులందరికీ ఉపయోగపడేలా ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలని ఏపీ ఎన్‌జీవో సంఘ రాష్ట్ర నేత చౌదరి పురుషోత్తంనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్సార్ కల్యాణమండపంలో ఆదివారం సీఐటీయూ 9వ జిల్లా మహాసభ (రెండరోజు) జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ పోరాటాలకు కార్మికులంతా అండగా నిలవాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న స్కీంవర్కర్‌లు, అంగన్‌వాడీలతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందని విమర్శించారు. బీడీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. పోరాటాలు, ధర్నాలు, బంద్‌లను అణచివేసేందుకు ముందస్తుగా సెక్షన్ 30 ని అమలు చేయడం సరికాదన్నారు. సెప్టెంబర్ 2న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు కార్మికులంతా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ముందుగా సీఐటీయూ జెండాను సీనియర్ నాయకుడు వీజీకే మూర్తి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగరావు, నాగమణి, డి.గోవిందరావు, ఎన్.తిరుపతిరావు, ఎన్.షణ్ముఖరావు, గురివినాయుడు, అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.