
ప్రభుత్వాస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచండి
విజయవాడ(లబ్బీపేట) ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్వచ్చ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఎగ్జిక్యూటీవ్ వైస్ చైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకట్రావు అన్నారు. ఆయన మంగళవారం కొత్త ప్రభుత్వాస్పత్రితోపాటు, పరిసరాలను పరిశీలించారు. ఓపీ బ్లాక్ పక్కన నిరుపయోగంగా ఉంచిన స్క్రాప్‌ను పరిశీలించి, దీనిని వీలైనంత త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని క్యాంటిన్‌ను పరిశీలించారు. ఆస్పత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి నెలా నాలగవ శనివారం స్వచ్చ్ ఆస్పత్రి కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ప్రధాన గేటు ఎదురుగా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న తోపుడు బండ్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్సకోసం వచ్చిన రోగులు, అటెండెంట్‌లకు పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. ఆస్పత్రికి అవసరమైన పరికరాలతో నివేదిక ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఎండీ భీమేష్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి రవికుమార్, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ నరసింహనాయక్ తదితరులు పాల్గొన్నారు.