జిల్లాపై సర్కారు చిన్నచూపు
జిల్లాపై సర్కారు చిన్నచూపు
Published Sun, Aug 7 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
– కృష్ణా పుష్కరాల వెబ్‌సైట్‌లో కనిపించని జిల్లా సమాచారం
– ఆంధ్రా ప్రాంత జిల్లాలకే దక్కిన ప్రాధాన్యం
సాక్షి, కర్నూలు:
కర్నూలు జిల్లా.. ఒకప్పటి ఆంధ్రరాష్ట్ర రాజధాని. రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని జిల్లా. దక్షిణ కాశీగా పేరుగాంచిన.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం కూడా ఇదే జిల్లాలో ఉంది. పవిత్ర కష్ణానది కూడా కర్నూలు జిల్లా వద్దనే ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. సంగమేశ్వరం వద్ద సప్తనదులతో కలిసి శ్రీశైల పాతాళాగంగలో మల్లన్న పాదాలను తాకి అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు చేరుతుంది. అంతటి ప్రాశ్యస్తం కలిగిన జిల్లాను కృష్ణా పుష్కరాల వేళ తెలుగుదేశం ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు భక్తుల్లో వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న పుష్కరాల సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసే వెబ్‌సైట్‌లో పొందుపరచకపోవడం భక్తుల వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.
పోర్టల్‌లో జిల్లా పుష్కర సమాచారం ఏదీ:
కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాకు దక్కాల్సిన ప్రచారం దక్కడం లేదని చెప్పడానికి ఇదో నిదర్శనం. సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రెండు ప్రాంతాల మధ్య విభేదాలు పెంచుతున్నాయి. తాజాగా కష్ణా పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం వెబ్ పోర్టల్‌ను అలాగే అండ్రాయిడ్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. అందులో కర్నూలు జిల్లాకు స్థానం దక్కపోవడంపై సీమ నేతలు, ప్రజలు, భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో వీటిని నిర్వహించేందుకు సర్కారు అన్నీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం భారీ నిధులను సర్కారు వెచ్చించింది. అదేవిధంగా ఈ పుష్కరాల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రంపై దృష్టి సారించేలా కష్ణా పుష్కరాలకు సంబంధించిన వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్‌ను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఈ మూడు జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులు, ఘాట్ల వివరాలు, సౌకర్యాలు తదితర అంశాలను ఇందులో పొందుపరిచారు. అయితే కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం సంగమేశ్వరం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పుష్కర వివరాలను మాత్రం అందులో పొందుపరచలేదు. జిల్లాలో జరుగుతున్న పుష్కర ఘాట్‌ల ఏర్పాట్లతోపాటు దేవాలయాల విశిష్టతకు సంబంధించిన సమాచారం వెబ్‌పోర్టల్, యాప్‌లలో లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని కేంద్రంగా ప్రచార ఆర్భాటం:
12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలకు సంబంధించిన వివరాల కోసం దేశవిదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వెబ్‌సైట్ పైనే ఆధారపడతారు. అలాంటి వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ప్రభుత్వం అంది వచ్చిన ప్రతి అంశంపై రాజధాని కేంద్రంగా ప్రచార ఆర్భాటం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కల్కూర చంద్రశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.
Advertisement
Advertisement