ఇదేనా మానవత్వం?
ఇదేనా మానవత్వం?
Published Thu, Sep 29 2016 11:38 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
సాక్షి, అమరావతి బ్యూరో : కష్టాల్లో ఉన్న వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మానవత్వం అంటూ నిలదీశారు. వరద ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం ఆ పార్టీ బృందం పరిశీలించింది. ప్రత్తిపాడు నియోజక వర్గంలోని వంగిపురం, గార్లపాడు, కొండపాటూరు గ్రామాల్లో పర్యటించింది.
కష్టాల ఏకరవు..
ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు కలెక్టరేట్‌లో శనివారం అధికారుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వరదల్లో దెబ్బతిన్న కుటుంబానికి సోమవారం సాయంత్రానికే బియ్యాన్ని పంపిణీ చేయాలని, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మళ్లీ వస్తానని ఆకస్మిక తనిఖీలు చేస్తానని విలేకర్ల సమావేశంలో హడావుడి చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయంటూ బాధితులు కష్టాలను వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట ఏకరవు పెట్టారు. ప్రత్తిపాడు మండలం వంగపురం దళిత కాలనీలో గురువారం వరకు బియ్యం పంపిణీ జరగలేదు. అక్కడ పేదల ఇళ్లల్లోకి నీరు వచ్చి మూడు రోజులపాటు అలానే ఉన్నాయి. గ్రామానికి రోడ్డు మార్గం దెబ్బతింది. పంట పొలాలు నీట మునిగాయి. ఇంతవరకు ప్రభుత్వం నుంచి వారికి సహాయం అందలేదు.
తిండి లేదంటే మంత్రి టాటా చెప్పారు
‘మా ఇంట్లోకి నీళ్లొచ్చాయి. మూడు రోజులపాటు నీటిలోనే ఉన్నాం. ఎవరూ పట్టించుకోలేదు. గ్రామంలో సర్పంచి చనిపోతే మంత్రి రావెల కిషోర్‌బాబు పరామర్శకు ట్రాక్టర్‌లో వచ్చారు. ట్రాక్టర్‌కు అడ్డంగా వెళ్లి.. తిండిలేదు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పే యత్నం చేశాం. కనీసం దిగకుండా మా బాధలు వినకుండా మంత్రి టాటా చెప్పి వెళ్లిపోయారు’ అని ప్రత్తిపాడు మండలం వంగపురంలో మరియమ్మ వైఎస్సార్‌సీపీ బృందం దృష్టికి తెచ్చారు.
గండ్లు పడినా...
కాకుమాను మండలం గార్లపాడు సమీపంలో నల్లమడ డ్రెయిన్‌కు గండ్లు పండి పంట పొలాలు కోతకు గురయ్యాయి. అయినా నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. మళ్లీ వర్షాలు వస్తే గండ్ల ద్వారా నీరు ప్రవహించి గ్రామాలతోపాటు, పంట పొలాలు నీట మునిగే ప్రమాదముందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రాక్టర్‌పై వెళ్లి...
కొండపాటూరులో రోడ్లు కోతకు గురై దారిలేక పోవడంతో నేతలు ట్రాక్టర్‌పై అతికష్టం మీద చేరుకొని నల్లమడ డ్రెయిన్‌కు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. బేషజాలకు పోకుండా ప్రభుత్వం సహాయం అందించాలని బొత్ససత్యనారాయణ, అంబటి రాంబాబు ప్రభుత్వానికిS విజ్ఞప్తి చేశారు. బొత్స సత్యనారాయణ గుంటూరు ఆర్డీవోకు ఫోన్ చేసి సీఎం బియ్యం పంపిణీ చేశామని చెబుతున్నారు. ఇక్కడ 40 పేద దళిత కుటుంబాలు 3 రోజులుగా నీళ్లలోనే ఉన్నాయని, కనీసం బియ్యం పంపిణీ కూడా చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇదేనా మానవత్వం అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎప్పుడు వర్షం వచ్చినా నల్లమడ డ్రెయిన్‌తో ఈ కాలనీ ముంపునకు గురవుతూనే ఉందని నియోజకవర్గ ఇన్‌చార్జి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడం లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు, జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, నాయకులు కొత్తాచిన్నపరెడ్డి, సయ్యద్‌మాబు, బండారు సాయిబాబు, కిలారి రోశయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement