ఘనంగా ప్రహ్లాదవరదుడి గరుడోత్సవం
ఘనంగా ప్రహ్లాదవరదుడి గరుడోత్సవం
Published Tue, Mar 14 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
– గోవిందా నామస్మరణతో మారుమోగిన అహోబిలక్షేత్రం
అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిల బ్రహ్మోత్సవాల చివరి రోజైన సోమవారం అర్ధ రాత్రి దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి గరుడోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. తర్వాత గరుడ వాహనము పై కొలువుంచి దిగువ అహోబిలంలోని మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవం మంగళవారం తెల్లవారు జామున వరకు సాగింది. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు అంచనా. దీంతో దిగువ అహోబిల క్షేత్రం గోవిందా నామస్మరణతో పులకించి పోయింది.
శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభ దశలో సకలదేవతలను ఆహ్వానిస్తూ.. ముగింపు రోజు సకదేవతలను సాగనంపుతూ ధ్వజావరోహణం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అహోబిలం పీఠాధిపతి శ్రీమాన్ శఠకోప యతీంద్ర మహాదేశికన్, ముద్రకర్త «శ్రీమాన్ శఠకోపం వేణుగోపాలన్, కార్యనిర్వాహణాధికారి మల్లిఖార్జునప్రసాదుల ఆధ్వర్యంలో వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు.
Advertisement
Advertisement