శాస్త్రోక్తంగా చక్రస్నానం
శాస్త్రోక్తంగా చక్రస్నానం
Published Mon, Mar 13 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
– వైభవంగా ద్వాదశారాధనం, పుష్పయాగం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో సోమవారం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ప్రత్యేకంగా అలంకరించి దిగువ అహోబింలోని కోనేరు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వస్త్రాలు మార్చి పీఠాధిపతి శ్రీ రంగానాథ యతీంద్ర మహాదేశికన్, ముద్రకర్త శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్ ఆ«ధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్ల ఎదుట సుదర్శనమూర్తికి, నిత్య అభిషేకమూర్తులకు కలిపి పంచామృతాభిషేకం, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం నవకలశ ప్థాపన, కుంకుమార్చనలు చేశారు. అనంతరం సుదర్శనమూర్తికి, నిత్య అభిషేక ఉత్సవమూర్తికి కోనేరులో చక్రస్నానం చేయించారు.
వైభవంగా ద్వాదశరాధనం, పుష్పయాగం
బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం ద్వాదశరాధనం, పుష్పయాగ కార్యక్రమాలు వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామికి ఆరాధన దోషాలను నివృత్తి చేసుకోవడం కోసం 12 మార్లు తిరువారాధన చేసి 12 రకాల భక్షాలను 12 రకాల అన్నముతో నివేదించారు. అనంతరం శ్రీ ప్రహ్లాదవరదస్వామి కొలువై భక్తులకు దర్శన మిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, ఈఓ మల్లిఖార్జున ప్రసాదులు పాల్గొన్నారు
Advertisement