వినాయకస్వామి రథోత్సవ దృశ్యం
– భక్తజన సంద్రంగా కాణిపాకం
కాణిపాకం(ఐరాల) : కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు బాహుదాతీరంలో భక్తులు పోటెత్తడంతో స్వామివారి సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. సకల దేవతల ఆశీర్వాదాలతో అష్టదిక్పాలకులు ముందు వెళుతుండగా గణేష్ మహరాజ్‌కీ జై అనే భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్వామివారి రథం కోటిసూర్య ప్రభలతో ముందుకు సాగింది. అంతకుముందు స్వామివారి మూల విరాట్‌కు సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించారు. సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉదయం సర్వాంకతులైన సిద్ధి, బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అలంకార మండపంలో ఉంచి విశేష పూజలు నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేక అలంకరణతో సిద్ధంగా ఉంచిన రథంపై ఆశీనులను చేసి రథోత్సవం నిర్వహించారు. అశ్వాలు, వృషభరాజులు వెంటరాగా స్వామివారు రథంపై కాణిపాక వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ ఉత్సవానికి కాకర్లవారిపల్లి వాసి కె.మీనాకుమారి, కాణిపాకం వాసులు పూర్ణచంద్రారెడ్డి, కె.హరిప్రసాద్‌రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, వెస్ట్ సీఐ ఆదినారాయణ, స్థానిక ఎస్‌ఐలు నరేష్ బాబు, శివశంకర్, ధరణీధర్, లక్ష్మీకాంత్ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రథోత్సవంలో ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, ఈఈ మురళి బాలకష్ణ, ఏసీ వెంకటేశు, ఏఈవోలు ఎన్‌ఆర్.కృష్ణారెడ్డి, ఎస్‌వీ.కృష్ణారెడ్డి, చిట్టెమ్మ, సూపరింటెండెంట్‌లు రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.