వ్యాట్ ఏ దోపిడీ | granite traders impropriety in district | Sakshi
Sakshi News home page

వ్యాట్ ఏ దోపిడీ

Published Sun, Jun 26 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

వ్యాట్ ఏ దోపిడీ

వ్యాట్ ఏ దోపిడీ

గ్రానైట్ అక్రమ రవాణాతో ఏడాదికి రూ.200 కోట్ల అవినీతి
వ్యాట్ ఎగవేత ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి
పేరుకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అమ్మకాలు సొంత రాష్ట్రంలోనే
విజిలెన్స్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి

 కొందరు గ్రానైట్ వ్యాపారులు పన్ను ఎగవేసేందుకు రోజుకో కొత్త దారిని వెతుక్కుంటున్నారు. వ్యాట్ నిబంధనల్లో ఇతర రాష్ట్రాలకు, మన రాష్ట్రానికి ఉన్న తేడాను ఆసరా చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తున్నట్లు రికార్డులు చూపుతూ మన రాష్ట్రంలోనే అమ్మకాలు సాగిస్తున్నారు.  పన్ను ఎగవేతతో ఒక్క ఏడాదిలో రూ.200 కోట్ల మేర దోచేసినట్లు ఏకంగా విజిలెన్స్ విచారణలోనే తేలిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గ్రానైట్ వ్యాపారుల అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. వ్యాట్ నిబంధనలను అడ్డుపెట్టుకొని  కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టి ఏడాదికి రూ.200 కోట్లు పైనే దోచుకుంటున్నారు. తాజా విజిలెన్స్ నివేదిక గ్రానైట్ వ్యాపారుల అక్రమాలను తేటతెల్లం చేసింది. వివరాల్లోకి వెళితే... గ్రాైనె ట్‌ను విదేశాలకు ఎగుమతి చేయాలంటే   రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలంటే కేవలం 2 శాతం వ్యాట్ చెల్లించాలి. మన రాష్ట్రంలో గ్రానైట్ అమ్మకాలు సాగించాలంటే మాత్రం 14.5 శాతం కట్టాలి.

ఈ వ్యాట్ నిబంధనలు అవకాశంగా తీసుకుంటున్న గ్రానైట్ వ్యాపారులు అక్రమాలకు తెగబడ్డారు. ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ తరలించినట్లు కమర్షియల్ ట్యాక్స్‌కు వ్యాట్  2 శాతం చెల్లించినట్లు వే బిల్లులు తీసుకుంటున్నారు. అయితే గ్రాైనె ట్‌ను స్వరాష్ట్రంలోనే విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తద్వారా 14.5 శాతం వ్యాట్‌లో 12.5 శాతం వ్యాట్‌ను ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి వ్యాపారులు రూ.200 కోట్లపైనే దోచుకుంటున్నారు. సాక్షాత్తు విజిలెన్స్ నివేదికలే ఈ అక్రమాలను వెలుగులోకి తేవటం గమనార్హం.

 2012 నుంచి 2015 మధ్య కాలంలో 9 వేల లారీల గ్రానైట్‌ను పేరుకు ఇతర రాష్ట్రాలకు అమ్మినట్లు చూపి స్వరాష్ట్రంలోనే అమ్మారంటే అక్రమార్కుల దందా ఏ స్థాయిలో సాగిందో తేటతెల్లమైంది. తద్వారా వ్యాపారులు రూ.60 కోట్లకు పైగా వ్యాట్ ఎగవేతకు పాల్పడినట్లు విజెలెన్స్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వాస్తవ పరిస్థితుల్లోకి తొంగిచూస్తే ఇంకా ఎన్నో రెట్లు అధికంగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.200 కోట్లకు మించి గ్రానైట్ వ్యాపారులు వ్యాట్ ఎగవేసినట్లు సమాచారం. ఇక వ్యాట్ పరిస్థితి ఇలా ఉంటే అసలు బిల్లులే లేకుండా గ్రానైట్ అక్రమ రవాణా విచ్చల విడిగా జరుగుతోంది.

రోజుకు పదుల సంఖ్యలో గానైట్‌ను వే బిల్లులు లేకుండా తరలించుకుపోతున్నారు. దీనివల్ల వ్యాట్‌తో సమానంగా ప్రభుత్వాదాయూనికి కోట్లాది రూపాయల గండి  పడుతోంది. గతంలో అక్రమ వే బిల్లులతో గ్రానైట్‌ను తరలిస్తున్న వారిని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో వారు చెప్పిన అక్రమాలు విన్న పోలీస్ అధికారులు సైతం నోరెళ్లబెట్టారు. ఈ లెక్కన ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. ఇతర రాష్ట్రాల పేరుతో ఎక్కువ శాతం గ్రానైట్‌ను సొంత రాష్ట్రంలోనే అమ్ముతూ వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విజిలెన్స్ అధికారులే పేర్కొంటుండటం గమనార్హం.  

జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లిలో 160 గెలాక్సీ గ్రానైట్ క్వారీలు, 31 బ్లాక్ పెరల్, 48 కలర్ గ్రానైట్, మొత్తం 239 క్వారీలున్నాయి. ఏడాదిలో బ్లాక్ గెలాక్సీ 3.60 లక్షల క్యూబిక్ మీటర్లు, బ్లాక్ పెరల్ 57 వేల క్యూబిక్ మీటర్లు, కలర్ గ్రానైట్లు 86 వేల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికితీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవంగా ఇంతకు రెట్టింపు గ్రానైట్ రాయిని క్వారీల నుంచి వెలికి తీస్తున్నట్లు సమాచారం. ఇందులో బ్లాక్ గెలాక్సీ 70 శాతం చైనాతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతుండగా 30 శాతం మాత్రమే దేశవ్యాప్తంగా సరఫరా అవుతోంది. బ్లాక్ పెరల్ 30 శాతం విదేశాలకు,70 శాతం స్థానికంగా,  కలర్ గ్రానైట్ 30 శాతం విదేశాలకు 70 శాతం స్థానికంగా అమ్ముడుపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 

 అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతున్నా మై నింగ్ అధికారులు, రవాణాశాఖ, చెక్‌పోస్టులు, రెవె న్యూ, పోలీసు తదితర విభాగాలు అందిన కాడికి దండుకొంటూ అడ్డకోవడం లేదన్న ఆరోపణలు గు ప్పుమంటున్నాయి. మరోవైపు ఇక్కడి అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారిన మరికొందరు అధికారు లు  ఎటువంటి తనిఖీలు నిర్వహించక ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement