సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం మూడో కన్ను తెరిచింది! అంచనా వ్యయాలను భారీగా పెంచేసి చేపట్టిన పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ‘థర్డ్ పార్టీ’తో విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిటైర్డ్ ఈఎన్‌సీలు బి.రోశయ్య, నారాయణరెడ్డి, నాక్ డైరెక్టర్ పీటర్, ఐఐటీ ప్రొఫెసర్ రమణ సభ్యులుగా థర్డ్ పార్టీని నియమించాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి.
శ్వేతపత్రం సాక్షిగా బాబు దోపిడీ..
రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అదే ఏడాది జూలై 28న సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని శ్వేతపత్రంలో ప్రకటించారు. జలయజ్ఞం కింద చేపట్టిన గుండ్లకమ్మ, గాలేరు–నగరి తొలిదశ, హంద్రీ–నీవా తొలిదశ, తాడిపూడి, తోటపల్లి, ముసురుమిల్లి, వంశధార, గురురాఘవేంద్ర తదితర 11 ప్రాజెక్టుల పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, మిగిలిపోయిన ఐదు శాతం పనులకు రూ.780 కోట్లు ఖర్చు చేస్తే కొత్తగా 2,03,628 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చని 2013–14 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. కానీ శ్వేతపత్రం సాక్షిగా చంద్రబాబు దోపిడీకి తెరతీశారు.
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో డీజిల్, సిమెంట్, స్టీలు ధరలు పెరగాయనే నెపంతో ధరల సర్దుబాటు కింద అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా 2014 ఫిబ్రవరి 7న నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 13) జారీ చేసింది. కమీషన్‌ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ ఉత్తర్వులు జారీ చేశారని గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో దీన్ని ఆయన అభయన్స్(నిలుపుదల)లో పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ముడుపుల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ ఉత్తర్వులు జారీ చేయించిందని, దీనివల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోందని, అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉండగా నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లకు మరింత ప్రయోజనం చేకూర్చేలా జీవో 13లో నిబంధనలు మార్చారు.‘ధరల సర్దుబాటు’ కింద కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు మంజూరు చేసేలా 2015 ఫిబ్రవరి 23న జీవో 22 జారీ చేయించారు.
అంతటితో ఆగకుండా ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) మౌలిక సూత్రాలను తుంగలో తొక్కుతూ పనుల పరిమాణాల ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించేలా జీవో 63 జారీ చేయించారు. ఈ రెండు ఉత్తర్వుల వల్ల సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని, ఖజానాపై భారం పడుతుందని నాడు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినా లెక్క చేయలేదు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశారని సాగునీటి రంగ నిపుణులు సైతం స్పష్టం చేశారు. పనులు గిట్టుబాటు కాకుంటే కాంట్రాక్టర్లను కొట్టినా పనులు చేయరంటూ వారి తరఫున వకల్తా పుచ్చుకున్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడానికే ఈ జీవోలు జారీ చేసినట్లు నమ్మించే యత్నం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా తప్పుబట్టిన ఉత్తర్వులనే అధికారంలోకి రాగానే సమర్థించడం ద్వారా బాబు తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు.
అంచనాలు పెంచి కమీషన్లు కాజేయ్..
కోరినంత కమీషన్లు చెల్లించని సాగునీటి కాంట్రాక్టర్లపై ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద చంద్రబాబు వేటు వేయించారు. ఆ తర్వాత జీవో 22, జీవో 63లను వర్తింపజేసి అంచనా వ్యయం పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఇలా గత ఐదేళ్లలో 25 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.39,935.34 కోట్ల నుంచి ఏకంగా రూ.96,785.72 కోట్లకు పెంచేశారు. ఆ తర్వాత కమీషన్‌లు చెల్లించే కాంట్రాక్టర్లకు పనులను కట్టబెట్టి భారీఎత్తున కమీషన్‌లు వసూలు చేసుకున్నారు.
గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.75,427.46 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో నీరు–చెట్టు కింద రూ.13,023.49 కోట్లు, అటవీ శాఖ ద్వారా ఖర్చు చేసిన రూ.185.90 కోట్లు పోనూ మిగతా రూ.57,332.91 కోట్లను సాగునీటి ప్రాజెక్టుల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. అయితే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేసిన దాఖలాల్లేకపోవడం గమనార్హం. కొత్తగా ఒక్కటంటే ఒక్క ఎకరాకూ నీళ్లందించిన పాపాన పోలేదు. ఈ వ్యవహారంలో రూ.30 వేల కోట్లకుపైగా దోపిడీ జరిగినట్లు అంచనా.
అవినీతిపరులపై చర్యలు
టీడీపీ హయాంలో కొత్తగా చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం, కొండవీటివాగు వరద మళ్లింపు పథకం నుంచి ఎన్నికలకు ముందు ప్రకటించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–హంద్రీ–నీవా ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, బీటీపీ ఎత్తిపోతల, ఉరవకొండ సీఎల్‌డీపీ, పత్తికొండ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ కుడి కాలువ, గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, ముక్త్యాల ఎత్తిపోతల, కోటపాడు–విస్సన్నపేట ఎత్తిపోతల, వరికపుడిశెల ఎత్తిపోతల, గుంటూరు ఛానల్ విస్తరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ, వంశధార–బాహుదా నదుల అనుసంధానం తదితర ప్రాజెక్టు పనుల అంచనా వ్యయంపై కూడా థర్డ్ పార్టీ విచారణ చేయనుంది. ఎంత అవినీతి జరిగిందో సర్కార్‌కు నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా అవినీతి పరు లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారవర్గాలు తెలిపాయి.
మూడు నెలల్లో సర్కారుకు నివేదిక
సాగునీటి ప్రాజెక్టుల వారీగా చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలు, ఈఈలతో థర్డ్ పార్టీ సమావేశమై అంచనాల లెక్కలు తేల్చి మూడు నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 2004లో వైఎస్సార్ జలయజ్ఞం పనులు చేపట్టారు. ఒకేసారి రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుట్టారు. వీటిని పూర్తి చేయడం ద్వారా కొత్తగా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. 2004 నుంచి 2009 వరకూ రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి 16 ప్రాజెక్టులను సంపూర్ణంగా, మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసిన వైఎస్సార్ 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించారు. మరో 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగ చరిత్రలో ఇదో రికార్డుగా అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
గుట్టు విప్పనున్న థర్డ్‌పార్టీ..
సాగునీటి ప్రాజెక్టుల వారీగా చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలతో థర్డ్ పార్టీ సమావేశం కానుంది. ప్రాజెక్టు చేపట్టినప్పుడు అంచనా వ్యయం ఎంత? 2014 నాటికి ఎంత పరిమాణం పని పూర్తయింది? బిల్లుల రూపంలో ఎంత చెల్లించారు? ఎంత పని మిగిలింది? ఆ పని పూర్తి చేయాలంటే ఎంత అవసరం? 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక మిగిలిన పని అంచనా వ్యయాన్ని ఎంతకు పెంచింది? పనులను ఎవరికి, ఎంత ధరకు అప్పగించారు? ఇప్పటివరకూ ఎంత పని పూర్తయింది? బిల్లుల రూపంలో ఎంత చెల్లించారు? ఎంత పని మిగిలింది? అన్న కోణంలో థర్డ్ పార్టీ వాస్తవ లెక్కలను రాబట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment