సాక్షి, అమరావతి: అంచనాలు పెంచి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించి వాస్తవ అంచనాలను మదింపు చేసి అక్రమాల నిగ్గు తేల్చుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. థర్డ్ పార్టీ విచారణ ముగిసేవరకు ఎదురు చూడకుండా, వాస్తవాలను బహిర్గతం చేసి భారీగా అంచనాలు పెంచిన ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలోచనా విధానాన్ని మార్చుకుని ప్రభుత్వ నిధులను ఆదా చేసే దిశగా పని చేయాలని అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం మరోసారి జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ..
ప్రజల ఆశలను నెరవేర్చేలా పాలించాలి..
‘ప్రభుత్వం డబ్బులు తిన్నవారు ఒకరు.. కానీ చెడ్డపేరు మీకు వస్తోంది.. ఆ పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడి నిజాయితీగా పనిచేయండి. వాస్తవ అంచనాలతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి’ అని సమీక్షలో సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించి ఖజానాకు నిధులు ఆదా చేసే అధికారులను ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానిస్తామని పునరుద్ఘాటించారు.
ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రజలు ఎన్నో విజ్ఞప్తులు చేశారని, వారి ఆశలు ఫలించేలా పాలన అందించాల్సిన బాధ్యత తనపై ఉందని జగన్ స్పష్టం చేశారు. ఐదు కోట్ల మందిలో తనకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, ప్రజలకు జవాబుదారుగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల వారీగా సాగునీటి పనులపై లోతుగా సమీక్షిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలనూ భాగస్వాములుగా చేసి ప్రాజెక్టుల ప్రాధాన్యతను నిర్ధారించి పనులు పూర్తి చేస్తామన్నారు.
జలయజ్ఞానికి తూట్లు పొడిచారు..
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంనికి చంద్రబాబు పాలనలో తూట్లు పొడిచారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో 2014 నాటికి కొంత భాగం పనులు మాత్రమే మిగిలాయని, వీటి అంచనా వ్యయాన్ని 200 నుంచి 300 శాతం పెంచడంతోపాటు పాత కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి టైలర్ మేడ్ నిబంధనల ద్వారా కమీషన్‌లు చెల్లించిన కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టారని స్పష్టం చేశారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ నుంచి వంశధార ప్రాజెక్టుల వరకూ అన్నిటిలోనూ అవినీతికి పాల్పడ్డారన్నారు.
‘జలయజ్ఞం కింద చేపట్టినప్పుడు ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? 2014 నాటికి ఎంత పని పూర్తయింది? ఎంత ఖర్చు చేశారు? ఎంత పని మిగిలింది? 2014 తర్వాత మిగిలిన పని అంచనా వ్యయాన్ని ఎంత పెంచేశారు? ఇప్పటివరకూ ఎంత పని పూర్తి చేశారు? బిల్లుల రూపంలో ఎంత చెల్లించారు? ఇంకా ఎంత పని మిగిలి ఉంది? అది పూర్తి కావాలంటే ఎంత అవసరం? అనే అంశాలపై ప్రాజెక్టుల వారీగా నివేదిక ఇవ్వండి. వాటిపై థర్డ్ పార్టీతో విచారణ చేయిద్దాం. ఇందులో జలవనరుల శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. అక్రమాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రాధాన్యతల వారీగా పనులు పూర్తి..
జలవనరుల శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉన్న ప్రాజెక్టుల ప్రాధాన్యత గుర్తించి పూర్తి చేద్దామని సూచించారు. వంశధార, తోటపల్లి, తారకరామతీర్థసాగరం, చింతలపూడి, వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, గుండ్లకమ్మ, గోదావరి డెల్టా ఆధునికీకరణ, కృష్ణా డెల్టా ఆధునికీకరణ, ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిగతా ప్రాజెక్టులను ప్రాధాన్యత కింద చేపట్టి పూర్తి చేస్తామన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణలో కేవలం మట్టి పనుల కోసమే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారని, రెండు ప్యాకేజీలు ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించారని, ఇదో పెద్ద కుంభకోణమని స్పష్టం చేశారు.
రివర్స్ టెండరింగ్‌తో అక్రమాలు బహిర్గతం
టీడీపీ సర్కారు ఎన్నికలకు ముందు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–హంద్రీ–నీవా ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, బీటీపీ ఎత్తిపోతల, ఉరవకొండ సీఎల్‌డీపీ, పత్తికొండ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ కుడి కాలువ, గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, ముక్త్యాల ఎత్తిపోతల, కోటపాడు–విస్సన్నపేట ఎత్తిపోతల, వరికపుడిశెల ఎత్తిపోతల, గుంటూరు ఛానల్ విస్తరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ, వంశధార–బాహుదా నదుల అనుసంధానం పనులు చేపట్టినట్లు జలవనరుల శాఖ అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.ఈ ప్రాజెక్టులకు ఫీజుబులిటీ, హైడ్రలాజికల్ క్లియరెన్స్ తీసుకోకపోవడం, కేవలం లైన్ ఎస్టిమేట్ల ఆధారంగా టెండర్లు పిలవడంపై సీఎం విస్మయం వ్యక్తం చేశారు. ఇందులో భారీ కుంభకోణం దాగుందని స్పష్టం చేశారు.
బీటీపీ ఎత్తిపోతల పథకం పనులను అంచనా వ్యయంలో 60 శాతం నిధులతోనే పూర్తి చేయవచ్చని ఒక ప్రజాప్రతినిధి చెప్పారని, ఆయనతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో అంచనా వ్యయాలను పెంచేయడంపై వాస్తవాలను వెల్లడిస్తే అక్రమాలు జరిగిన ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జ్యుడీషియల్ కమిషన్ నేతృత్వంలో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే ప్రాజెక్టుల అంచనా వ్యయంలో కనీసం 20 శాతం తగ్గుతుందని, ఆ మేరకు ఖజానాకు ఆదా అయ్యే నిధులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చని పేర్కొన్నారు.
అవసరమైన ప్రాజెక్టులే చేపడదాం..
రాజధాని తాగునీటి అవసరాల కోసం రూ.2,169 కోట్లతో వైకుంఠపురం బ్యారేజీ పనులను చేపట్టామని, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు సార్లు టెండర్లు నిర్వహించామని, 13.19 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించామని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. అయితే కొండవీటి వాగు వరద మళ్లింపులో భాగంగా మూడు జలాశయాల నిర్మాణాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) చేపట్టిందని సీఎం గుర్తు చేశారు. వైకుంఠపురం బ్యారేజీ వద్ద నీటి లభ్యత ఉందో లేదో మరోసారి సర్వే చేయాలని ఆదేశించారు.
సీఆర్‌డీఏ జలాశయాలను నిర్మిస్తున్న నేపథ్యంలో వైకుంఠపురం బ్యారేజీ పనులు అవసరమో కాదో తేల్చి నివేదిక ఇవ్వాలని సూచించారు. వంశధార–బాహుదా నదుల అనుసంధానం పనుల అంచనా వ్యయం రూ.6326.62 కోట్లని అధికారులు చెప్పడంతో సీఎం వైఎస్ జగన్ నివ్వెరపోయారు. దీనిపై మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. తాను పాదయాత్ర చేసినప్పుడు రాజోలి, జోలదరాశి, గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులు చేపట్టాలని అందిన విజ్ఞప్తులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.
గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకుందాం
చింతలపూడి ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించి హరిశ్చంద్రాపురం నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసి ఆయకట్టును స్థిరీకరించడానికి రూ.6,020 కోట్లతో గోదావరి–పెన్నా తొలి దశను చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.అయితే చింతలపూడి ఎత్తిపోతల నీటితో చింతలపూడి, కోటపాడు–విస్సన్నపేట, నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఒకేసారి నీళ్లందించడం ఎలా సాధ్యమవుతుందన్న సీఎం వైఎస్ జగన్ ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు.
కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఎత్తు పెంచుతున్న నేపథ్యంలో కృష్ణా నదిలో నీటి లభ్యత మరింత తగ్గిపోయి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా గోదావరి జలాల మళ్లింపుపై ఒకరోజు మేథోమథనం చేసి పనులు చేపడదామని స్పష్టం చేశారు.
పోలవరంపై ప్రత్యేక దృష్టి..
పోలవరం పనులపై పర్యావరణ నిషేధాన్ని సడలిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల గడువు జూలై 2వ తేదీతో ముగుస్తుందని ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. పర్యావరణ నిషేధాన్ని ఎత్తివేసేలా కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తానని, తక్షణమే వివరాలు పంపాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి యుద్దప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలవరం పనులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రధాన కాంట్రాక్టు సంస్థకు డీజిల్ ఖర్చుల కోసం తక్షణమే రూ.50 కోట్లు విడుదల చేయాలని అధికారులను సీఎం అదేశించారు.
గోదావరికి మరో నెల రోజుల్లో వరదలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకూ చేసిన పనులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, వివిధ ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు.
‘‘టెండర్ల వ్యవస్థను చంద్రబాబు అపహాస్యం చేశారు. అంచనాల్లో వంచనకు పాల్పడి సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచేయించారు. ఎక్కువ కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టైలర్ మేడ్ నిబంధనలతో టెండర్లు పిలిచారు. అధిక ధరలతో కాంట్రాక్టర్లకు అప్పగించి ఖజానాకు గండి కొట్టి కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అంచనాలు పెంచేయడంపై వాస్తవాలు చెప్పండి. అవినీతి జరిగిన ప్రాజెక్టులకు రివర్స్ టెండర్లు నిర్వహిద్దాం. ఖజానాకు కనీసం 20 శాతం నిధులు ఆదా అవుతాయి. ఈ డబ్బులు ఆదా కావడానికి సహకరించిన అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తాం’’
‘మా నాన్న, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టారు. ఆ ప్రాజెక్టులు అన్నిటినీ పూర్తి చేసి కరువన్నదే ఎరుగని ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది నాన్న ఆశయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తాం’’
‘‘తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇద్దాం. సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతులకు ప్రతిఫలం దక్కేలా ఉండాలి. అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే’’
జలవనరుల శాఖపై సమీక్షలో
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment